ఇండిపెండెంట్ హౌస్ కాదు.. ఆ అపార్ట్ మెంట్ లో ప్లాట్ రూ.111 కోట్లు

Update: 2021-07-24 03:27 GMT
విన్నంతనే విస్మయానికి గురి చేసేలా దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో లావాదేవీలు సాగుతున్నాయి. కరోనా మహమ్మారి దెబ్బకు రియల్ రంగం కుదేల్ అవుతుందన్న అంచనాలకు భిన్నంగా.. భారీ ఎత్తున కొనుగోళ్లు సాగుతున్నాయి. అయితే.. దీనికి కారణాలు లేకపోలేదు. దేశీయంగా రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది? విలాసవంతమైన భవనాల అమ్మకాలు ఏ రీతిలో సాగుతున్నాయి? అన్న విషయంపై అవగాహన కల్పించేలా పలు నివేదికలు వెల్లడవుతున్నాయి. తాజాగా ఆ తరహా నివేదిక ఒకటి విడుదలైంది.

దేశంలో ఖరీదైన నివాస గృహాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరం. ఇక్కడ జరిగే లావాదేవీలు ఆసక్తికరంగానే కాదు..కొన్ని లావాదేవీలు ఆశ్చర్యానికి గురి చేసేలా ఉండటం గమనార్హం. తాజాగా స్క్వేర్‌ యార్డ్స్‌నివేదిక ఒకటి విడుదలైంది. అందులో పలు ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. ఈ ఏడాది మొదటి ఆర్నెల్ల కాలంలో ముంబయిలో లగ్జరీ గృహాల లావాదేవీలు భారీగా సాగుతున్నాయి.

రూ.15 కోట్లకు పైగా ధరలు పలికే గృహాలు 45 శాతం లావాదేవీలు జరిగితే.. 30-40 కోట్ల మధ్య ధర పలికే గృహాలు 10 శాతం.. రూ.50 కోట్లకు పైగా ధర పలికే గృహాలు ఏడు శాతం లావాదేవీలు సాగినట్లుగా చెబుతున్నారు. ముంబయిలో విలాసవంతమైన గృహాల లావాదేవీలు సౌత్ భాగంలో సాగాయి. అక్కడి లోయర్ పరేల్ లో ఎక్కువగా సాగాయి. దీనికి కారణం ప్రభుత్వం రెండు శాతం స్టాంప్ డ్యూటీని తగ్గించటం.. కరోనా కారణంగా ఇంటి ధరల్లో 15 శాతం నుంచి 30 శాతం మధ్య ధరలు తగ్గటంతో మంచి ఆఫర్ అన్నట్లుగా పెద్ద ఎత్తున కొనుగోళ్లు సాగినట్లుగా చెబుతున్నారు.

బాంద్రాలోని మౌంట్ మేరీ అపార్ట్ మెంట్ లో రూ.111 కోట్లతో 59,184 చదరపు అడుగుల్లో అపార్ట్ మెంట్ ను అవధర్నా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ కొనుగోలు చేసింది. అంతే కాదు మలబార్ హిల్స్ లోని సీసేన్ లో రూ.103 కోట్లతోమరో ప్లాట్ ను అబిస్ రియల్కాన్ కొనుగోలు చేయటం ద్వారా.. ఇంత భారీ ఎత్తున ప్లాట్లను కొనుగోలు చేసే వైనం ఇటీవల పెరిగింది. కోట్లాది రూపాయిలు ఖర్చు చేసి ఇళ్లను కొనుగోలు చేసినప్పుడు ఇండిపెండెంట్ హౌస్ ను కొనుగోలు చేస్తారని భావిస్తాం. అందుకు భిన్నంగా అపార్ట్ మెంట్లలో విలాసవంతమైన ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి వ్యక్తమవుతోంది. పలువురు ప్రముఖులు ఈ తరహా లగ్జరీ ఇళ్లను కొనుగోలు చేయటం గమనార్హం.

ముంబయిలోనే కాదు.. హైదరాబాద్ లోనూ లగ్జరీ ప్లాట్లు.. విల్లాల అమ్మకాల జోరు భారీగా సాగుతోంది. గండిపేట, కోకాపేట, మోకిల, శంకర్‌పల్లి, కొంపల్లి, బాచుపల్లి వంటి ప్రాంతాలలో ప్రీమియం అపార్ట్‌మెంట్లు, విల్లాలు, శివారు ప్రాంతాలలో వీకెండ్‌ హోమ్స్‌లకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. 6 వేల చదరపు అడుగల కంటే ఎక్కువ విస్తీర్ణం లేదా అంతస్తుకు ఒకటే అపార్ట్‌మెంట్‌ ఉండే ప్రాజెక్ట్‌లలో కొనుగోళ్లకు కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా కారణంగా ఆతిథ్య రంగంలోని కంపెనీలు విస్తరణ లేకపోవటంతో వాటి యజమానులు, క్యాపిటల్‌ గెయిన్‌ లాభాలను ఆర్జించే ఇన్వెస్టర్లు ఎక్కువగా ఈ తరహా గృహాలను కొనుగోలు చేస్తున్నట్లు రియల్ ఎస్టేట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ముంబయిలో లగ్జరీ ప్లాట్లను కొనుగోలు చేసిన ప్రముఖుల్లో కొందరిని చూస్తే..

- సుప్రీంకోర్టు న్యాయవాది నటాషా ఎస్ దాల్మియా రెండు ప్లాట్లు.. ఒక్కొక్కటి రూ.34 కోట్లు
- అమితాబ్ ఓశివారాలోని ది అట్లాంటిస్ ప్రాజెక్టులో ప్లాట్ రూ.31 కోట్లు
- ఓశివారాలోని ది అట్లాంటిస్ లో సన్నీ లియోన్ ప్లాట్ రూ.16 కోట్లు
- బాలీవుడ్ సినీ నిర్మాత ఎల్ రాయ్
- బాలీవుడ్ దర్శకుడు విపుల్ అమృతల్‌ షా
- హెచ్ డీఎఫ్ సీ ఛైర్మన్ దీపక్ పరేఖ్ సతీమణి స్మిత డీ పరేఖ్
- హెచ్ డీఎఫ్ సీ సెక్యురిటీస్ ఎండీ అండ్ సీఈవో ధీరజ్ రెల్లీ
- మహారాష్ట్ర మంత్రి అశోక్ ఎస్ చవాన్
- గోల్డ్ మన్ శాక్స్ ఎండీ రజత్ సూద్


Tags:    

Similar News