గుడ్ న్యూస్ : మంకీ పాక్స్ ను గుర్తించేందుకు ఆర్టీపీసీఆర్ కిట్

Update: 2022-05-30 02:30 GMT
మంకీపాక్స్ మహమ్మారి.. రోజురోజుకు విజృంభిస్తోంది. ఇప్పటికే 20 దేశాలకు ఈ వైరస్ సోకింది. ప్రపంచ వ్యాప్తంగా 200లకు పైగా కేసులు నమోదయ్యాయి. మరో 100 అనుమానిత కేసులు ఉన్నాయి. ఈ క్రమంలో మంకీపాక్స్ను గుర్తించేందుకు ఓ రియల్ టైమ్ పీసీఆర్ కిట్ను రూపొందించింది ట్రివిట్రాన్ హెల్త్కేర్.

కరోనా కాలంలోనూ కొవిడ్ ర్యాపిడ్ టెస్టుల్లో సమర్థ ఫలితాలు రాక.. ప్రపంచమంతా ఆర్టీపీసీఆర్ టెస్ట్నే నమ్ముకుంది. ఈ క్రమంలో వేగంగా వ్యాపిస్తోన్న మంకీపాక్స్ ను త్వరగా కనిపెట్టడానికి భారత్ లోని మెడికల్ పరికరాల తయారీ సంస్థ ట్రివిట్రాన్ హెల్త్కేర్ ఓ రియల్ టైమ్ పీసీఆర్ కిట్ను రూపొందించింది. ఫ్లోరోసెన్స్ ఆధారంగా ట్రివిట్రాన్‌ హెల్త్‌కేర్‌ సంస్థ ఆర్‌టీ-పీసీఆర్‌ కిట్‌ను తయారు చేసింది.

వన్‌ ట్యూబ్‌ సింగిల్‌ రియాక్షన్‌ ఫార్మాట్‌లో స్మాల్‌పాక్స్‌, మంకీపాక్స్‌ తేడాను గుర్తిస్తుంది. ఈ కిట్తో గంటలోనే రిజల్ట్ వచ్చేస్తోంది. ఈ కిట్‌తో టెస్టు చేసుకునేందుకు పొడి స్వాబ్‌లతో పాటు వీటీఎం స్వాబ్‌లను కూడా ఉపయోగించుకోవచ్చు. మంకీపాక్స్‌ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే  బ్రిటన్‌, స్పెయిన్‌, పోర్చుగల్‌, కెనడా, అమెరికా సహా 20 దేశాల్లో ఈ కేసులు వెలుగుచూశాయి.

ప్రపంచాన్ని కలవరపెడుతోన్న మంకీపాక్స్ వైరస్పై ముమ్మర పరిశోధనలు మొదలయ్యాయి. కరోనా కాలంలోనూ వేగంగా స్పందించి టీకా తయారు చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసిన భారత్ ఇప్పుడు మంకీపాక్స్ పరిశోధనల్లోనూ కీలక పాత్ర వహిస్తోంది.

ఇప్పటి వరకు భారత్లో మంకీపాక్స్ కేసులు నమోదు కాలేదు. కానీ ముందుగానే అప్రమత్తమై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ వైరస్ భారత్లోకి ప్రవేశించకుండా చర్యలు చేపడుతోంది. ఒకవేళ ప్రవేశించినా వ్యాప్తి చెందకుండా అప్రమత్తమైంది. భారత్లోకి మంకీపాక్స్ ప్రవేశిస్తే.. దానికి తగిన చికిత్స అందించేలా.. బెంగళూరు వైద్యులు మంకీపాక్స్ ట్రీట్మెంట్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు.

మంకీపాక్స్ వ్యాప్తిని కట్టడి చేయకపోతే ప్రపంచ దేశాలన్నింటికీ త్వరలోనే విస్తరించే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనికి సరిపడా టీకాలు లేకపోవడం వల్ల తయారు చేసే లోపే ప్రపంచమంతా వ్యాధి బారిన పడే అవకాశముందని చెబుతున్నారు. వీలైనంత త్వరగా మంకీపాక్స్ బారిన పడిన దేశాలు ఆంక్షలు విధించుకుని వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి డాక్టర్ సైల్వై బ్రైండ్ అభిప్రాయపడ్డారు.
Tags:    

Similar News