తగ్గేదేలే.. యూనివర్సిటీ పేరు మార్పుపై ముందుకే!

Update: 2022-11-01 05:42 GMT
విజయవాడలో ఉన్న ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం మార్చింది. ఇందుకు సంబంధించిన బిల్లుపై గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ సంతకం కూడా చేశారు. దీంతో ఇన్నాళ్లూ డాక్టర్‌ ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌గా ఉన్న వర్సిటీ పేరు డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మారింది.

ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో యూనివర్సిటీ పేరు మారుస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ హయాం కంటే, చంద్రబాబు హయాం కంటే తన తండ్రి, తన హయాంలోనే ఎక్కువ ఆస్పత్రులు, వైద్య కళాశాలలు నెలకొల్పామని.. అందువల్ల తన తండ్రి పేరే యూనివర్సిటీకి ఉండటం ధర్మమని జగన్‌ సమర్థించుకున్న సంగతి తెలిసిందే.

ఈ మేరకు శాసనసభ, శాసనమండలిలో యూనివర్సిటీ పేరు మార్పు బిల్లును ప్రవేశపెట్టి జగన్‌ ప్రభుత్వం ఆమోదించుకున్న సంగతి తెలిసిందే. దీనికి తాజాగా గవర్నర్‌ సంతకం కూడా పెట్టడంతో అది చట్టరూపం దాల్చింది.

దీంతో జగన్‌ ప్రభుత్వం యూనివర్సిటీ పేరును డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చినట్టు గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఈ నిర్ణయంపై అన్ని పార్టీలు, వివిధ సంఘాల్లో .. చివరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌లోనే పలువురు నేతల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయిన సంగతి తెలిసిందే. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ పేరు మార్పును నిరసిస్తూ తన అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి, హిందీ అకాడమీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. స్వయంగా సీఎం జగన్‌ సోదరి, వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సైతం జగన్‌ చర్యను తప్పుబట్టారు.

కాగా తాము అధికారంలోకి వచ్చాక యధావిధిగా ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌గా కొనసాగిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News