బతికి ఉన్న వ్యక్తికి సమాధి కట్టే నీచ.. నికృష్ట చర్యలేంటి కేసీఆర్?

Update: 2022-10-21 04:17 GMT
రాజకీయంగా సవాలచ్చ ఉండి ఉండొచ్చు. అంతమాత్రానికే ఎవరూ చేయని పనులకు తెర తీయటం ఎంత మాత్రం మంచిది కాదు. తనకు ప్రత్యర్థులుగా మారిన రాజకీయ పార్టీల విషయంలో టీఆర్ఎస్ ఎంత కరకుగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ రాజ్యం నడిచినప్పుడు ప్రత్యర్థుల్ని పూచిక పుల్లల మాదిరిగా చూసే గులాబీ నేతలు.. కాస్తంత తేడా వచ్చినా విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ విరుచుకుపడుతుంటారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో వాతావరణం మొత్తం టీఆర్ఎస్ వర్సస్ బీజేపీ అన్నట్లుగా ఉండటం తెలిసిందే.

టీఆర్ఎస్ సైతం బీజేపీని సీరియస్ గా తీసుకోవటమే కాదు.. తాజా ఉపపోరులో షాకివ్వాలని గట్టి పట్టుదలతో ఉంది. అందుకోసం దేనికైనా రెఢీ అన్నట్లుగా వ్యవహరిస్తోంది. తనకున్న బలం మొత్తాన్ని బరిలోకి దింపేసి.. మునుగోడు ఉప పోరును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను ఆసక్తికి కారణమైంది. టీఆర్ఎస్ విసిరిన సవాలుకు అంతే ధీటుగా స్పందిస్తున్న బీజేపీ.. మునుగోడు ఉప పోరును మరింత సీరియస్ గా తీసుకుంటోంది. సై అంటే సై అన్నట్లుగా వ్యవహరిస్తోంది.

ఇలాంటి వేళ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సమాధి కట్టిన వైనం ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారింది. రాజకీయంగా ఎంత వైరం ఉంటే మాత్రం బతికి ఉన్న నేతకు సమాధి కట్టటం ఎంతవరకు సబబు? అన్నది ప్రశ్నగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడి సమాధి కట్టిన వైనంపై బీజేపీ వర్గాలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నాయి.

బతికి ఉన్న వ్యక్తికి సమాధి కట్టే నీచ.. నికృష్ట చర్యలకు టీఆర్ఎస్ నేతలు దిగటం ద్వారా.. తమ పరిమితుల్ని దాటేశారని ఫైర్ అవుతున్నారు కమలనాథులు.  తమ సహనాన్ని అసమర్థతగా కల్వకుంట్ల కుటుంబం భావిస్తే.. టీఆర్ఎస్ పార్టీ.. కేసీఆర్ ఫ్యామిలీ తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణను కల్వకుంట్ల మాఫియా రాజ్యంగా మారుస్తున్నారంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అవుతున్నారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి ఎదురవుతుందన్న ఉద్దేశంతోనే ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చిల్లర రాజకీయాలతో తొండి చేసి ఎన్నికల్లో గెలవాలని టీఆర్ఎస్ భావిస్తోందన్న కిషన్ రెడ్డి.. నడ్డాకు సమాధి కట్టటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లుగా హెచ్చరిస్తున్నారు. రాజకీయ వైరం సహజమే. అంతమాత్రానికే బతికి ఉన్న  ముఖ్యనేత సమాధిని కట్టే తీరు మాత్రం సరైనది కాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఈ ఇష్యూలో టీఆర్ఎస్ తప్పు చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News