ఆర్‌ఆర్‌ఆర్‌ కు కీలక సూచన చేసిన హైకోర్టు!

Update: 2023-01-20 05:14 GMT
వైఎస్సార్సీపీ నరసాపురం రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు, జగన్‌ ప్రభుత్వానికి మధ్య వార్‌ కొనసాగుతోంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ ఎంపీగా గెలిచిన రఘురామ ఆ తర్వాత పొడసూపిన విభేదాలతో వైఎస్సార్సీపీకి దూరమయ్యారు. అప్పటి నుంచి ఏకుకు మేకులా మారి జగన్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు వైఎస్సార్సీపీ నేతల నుంచి అంతే ధీటుగా రఘురామపై కౌంటర్లు పడుతున్నాయి.

నిత్యం సోషల్‌ మీడియా, యూట్యూబ్, మీడియా సంస్థల ద్వారా జగన్‌ ప్రభుత్వంపై, ఏపీ రాజకీయాలపైన రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. నిత్యం 'రచ్చబండ' పేరుతో జగన్‌ ప్రభుత్వ విధానాలపై నిప్పులు చెరుగుతున్నారు.

ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజుపై రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్‌ స్టేషన్లలో రాజద్రోహం కింద కేసులు నమోదు చేశారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ప్రయత్నిస్తున్నారని పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఇప్పటికే ఒకసారి సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనపై థర్డ్‌ డిగ్రీ కూడా ప్రయోగించారని రఘరామ అప్పట్లో తీవ్ర ఆరోపణలు చేశారు.

ప్రస్తుతం రఘురామకృష్ణరాజు హైదరాబాద్‌ కే పరిమితమయ్యారు. ఏపీకి రావాలని రెండుమూడు సార్లు ప్రయత్నించినా ఆయనను పోలీసులు అడ్డుకునే అవకాశం కనిపించడంతో రాలేకపోయారు. కొద్ది రోజుల క్రితం ఆయన హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తనపై ఏపీలో ఎన్ని కేసులు ఉన్నాయో, ఏయే స్టేషన్లలో కేసులు నమోదు చేశారో తనకు తెలియజేయాలని డీజీపీని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీంతో రఘురామపై ఎన్ని కేసులు పెట్టారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో స్పందించిన హోం శాఖ ఎంపీపై 11 ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయని వెల్లడించింది.

అయితే.. ఎవరు ఫిర్యాదులు చేశారు? ఎందుకు చేశారు? అనే విషయాలను ప్రభుత్వం చెప్పలేదు. దీంతో ఎఫ్‌ఐఆర్‌ వివరాలతో పాటు, పెండింగ్‌ ఫిర్యాదుల వివరాలను ఇవ్వాలని రఘురామ హైకోర్టును ఆశ్రయించారు. ఆ వివరాలు అందజేస్తే తాను చట్టనిబంధనల మేరకు ప్రత్యామ్నాయ మార్గాలు ఆశ్రయించేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. పిటిషనర్‌ రాష్ట్రంలోకి వస్తే ఫిర్యాదులను కేసులుగా మార్చి అరెస్టు చేసే అవకాశం ఉందని ఆయన తరఫున న్యాయవాది ఉమేశ్‌చంద్ర కోర్టు దృష్టికి తెచ్చారు. ఎలాంటి కుట్రా లేకపోతే ప్రభుత్వం ఫిర్యాదుల వివరాలను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో పోలీసు స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదుల వివరాలను అందజేయాలని కోరుతూ రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శికి, డీజీపీకి సమాచార హక్కు (ఆర్‌టీఐ) చట్టం కింద దరఖాస్తు చేసుకోవాలని రఘురామకృష్ణరాజుకు హైకోర్టు సూచించింది.

మరోవైపు పిటిషనర్‌ రఘురామరాజుపై వివిధ పోలీసు స్టేషన్లలో మొత్తం 11 కేసులు నమోదయ్యాయని హోం శాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది మహేశ్వర్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేసేందుకు సమయం కావాలని న్యాయస్థానాన్ని కోరారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు విచారణను పది రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ ఆదేశాలిచ్చారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News