డబ్బుల కోసం మృతదేహాన్ని ఇవ్వని ఆస్పత్రి

Update: 2020-10-25 10:50 GMT
హైదరాబాద్ లోని కొండాపూర్ లో గల ఓ కార్పొరేట్ ఆస్పత్రి నిర్వాకం అందరినీ ఆగ్రహానికి గురిచేసింది. కరోనాతో మృతిచెందిన ఓ వ్యక్తి మృతదేహాన్ని ఇవ్వకుండా దారుణంగా ప్రవర్తించింది.

గత నాలుగురోజులుగా కొండాపూర్ లోని కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విజయేందర్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు మృతి చెందాడు. ఇప్పటికే ఆస్పత్రికి బాధిత కుటుంబం రూ.2.50 లక్షలు చెల్లించింది. మరో రూ.3 లక్షలు చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని ఆస్పత్రి సిబ్బంది డిమాండ్ చేసింది.

బాధిత కుటుంబం తమ దగ్గర అంత డబ్బులు లేవని.. ఇంత చెల్లించినా ఇంకా డబ్బులంటే తమ వల్ల కాదంటూ కుటుంబీకులు చెబుతున్నారు.

ఆస్పత్రి మృతదేహాన్ని ఇవ్వకపోవడంతో సదురు ఆస్పత్రి ముందు మృతుడి కుటుంబీకులు, బంధువులు ఆందోళనకు దిగారు.

ఇప్పటికే హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆస్పత్రులు కరోనా చికిత్సల పేరుతో దోచుకుంటున్నాయనే ఫిర్యాదులు వచ్చాయి. తెలంగాణ సర్కార్ కొన్ని ఆస్పత్రులపై నిషేధం కూడా విధించాయి. అయినా కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.. మరి ఈ ఆస్పత్రిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచిచూడాలి.
Tags:    

Similar News