ఎన్నిక‌ల ముంగిట‌.. మోడీకి చుక్క‌లు చూపిస్తున్న 'గ్రామాలు'

Update: 2022-12-28 16:30 GMT
వ‌చ్చే మే నెల‌లో క‌ర్ణాట‌క‌లో ఎన్నిక‌లు ఉన్నాయి. ఈ ఎన్నిక‌ల‌ను బీజేపీ ప్రాణ ప్ర‌తిష్ట‌గా భావిస్తోంది. మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకుని.. ఏక‌ఛ‌త్రాధిప‌త్యంగా ఏలాల‌ని క‌మ‌ల నాథులు ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావాల‌ని భావిస్తున్న ప్ర‌ధాని మోడీకి.. క‌ర్ణాట‌క ఎన్నిక‌లు మ‌రింత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారుతున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో 865 గ్రామాల‌కు సంబంధించిన వివాదం.. ఆయ‌న‌ను ముప్పు తిప్ప‌లు పెడుతోంది. చుక్క‌లు చూపిస్తోంది.

ఏంటి ర‌గ‌డ‌? కర్ణాటకలో మరాఠీ మాట్లాడే ప్రజలు అధికంగా ఉన్న 865 గ్రామాలను తమ రాష్ట్రంలో విలీనం చేయాలని మహారాష్ట్ర అసెంబ్లీ తాజాగా తీర్మానించింది. అంతేకాదు సుప్రీంకోర్టులో పోరాడాలని నిశ్చయించింది. కర్ణాటకలో ఉన్న 865 గ్రామాల్లోని మరాఠీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతుగా నిలబడుతుంద‌ని మ‌హా స‌ర్కారు తేల్చి చెప్పింది. దీంతో బెళగావి, కర్వాడ్, నిపాని, బీదర్, భాల్కి పట్టణాలు, 865 గ్రామాల్లోని ప్రతి అంగుళం భూభాగాన్ని మహారాష్ట్రలో కలపాలని న్యాయపరంగా సుప్రీంకోర్టులో పోరాడనున్నారు.

అయితే.. క‌ర్ణాట‌క మాత్రం ఈ గ్రామాలు.. ప‌ట్ట‌ణాలు వ‌దులుకునేది లేద‌ని స్ప‌ష్టం చేసింది. దీనికి కార‌ణం.. ఎన్నిక‌లే.. ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం.. ఈ విష‌యాన్ని సెంటిమెంటుగా మార్చుకునేందుకు క‌ర్ణాట‌క‌లోని బీజేపీ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే, మ‌రో వైపు.. మ‌హా రాష్ట్ర కూడా దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. అటు క‌ర్ణాట‌క‌లోనూ.. ఇటు మ‌హారాష్ట్రలోనూ.. బీజేపీ ప్ర‌భుత్వాలే ఉన్నాయి.(మ‌హాలో సంకీర్ణం).

దీంతో ఈ గ్రామాల‌పై ఏం చేయాల‌నేది మోడీకి ఇప్పుడు.. సంక‌టంగా మారింది. కాగా, సరిహద్దు వివాదం మహారాష్ట్ర రాజేసిన అంశమే అని పేర్కొంటూ కర్ణాటక అసెంబ్లీ కూడా ఇటీవ‌ల ఏకగ్రీవంగా తీర్మానించింది. రాష్ట్రంలోని అంగుళం భూమి కూడా మహారాష్ట్రకు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ఇది ఇరు రాష్ట్రాల మధ్య తీవ్రమైన మాటల యుద్ధానికి దారితీసింది.  

ఎప్ప‌టినుంచి వివాదం..1957 నుంచి ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతోంది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల విభజన చేసిన సమయంలో బెళగావి ప్రాంతం కర్ణాటకలో విలీనమైంది. అంతకుముందు ఈ ప్రాంతం బాంబే ప్రెసిడెన్సీలో భాగంగా ఉంది. ఇక్కడ మరాఠీ మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్నారని, ఈ నేపథ్యంలో వాటిని తమ రాష్ట్రంలో కలిపేయాలని మహారాష్ట్ర డిమాండ్ చేస్తోంది. కర్ణాటక మాత్రం.. రాష్ట్రాల పునర్విభజన చట్టం, 1967 మహాజన్ కమిషన్ నివేదికలను ప్రామాణికంగా భావిస్తోంది. ఎన్నిక‌ల ముందు.. ఇప్పుడు  మ‌హా వేడి ర‌గ‌ల‌డంతో మోడీ ప‌రిస్థితి ఇబ్బందిగా మారింది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News