ఏపీకి రోజు ఆలస్యంగా విమానాలు.. అసలు కారణం చెప్పిన కేంద్రమంత్రి

Update: 2020-05-25 06:30 GMT
అదిగో తోక అంటే ఇదిగో పులి అన్నట్లుగా మారింది ఏపీ రాజకీయం. బోడిగుండుకు మోకాలికి లింకు పెట్టేసే మాలోకాలు ఈ మధ్యన పెరిగిపోతున్నాయి. విషయం ఏదైనా.. దాన్ని రాజకీయ కోణంలో చూసే ధోరణి అంతకంతకూ ఎక్కువ అవుతోంది. దేశవ్యాప్తంగా మే 25 నుంచి విమాన సర్వీసుల్ని స్టార్ట్ చేస్తున్న వైనం తెలిసిందే. అదే రోజున ఏపీ విపక్ష నేత చంద్రబాబు.. హైదారాబాద్ నుంచి విశాఖకు జర్నీ ప్లాన్ చేసుకున్నారు. అయితే.. ఏపీకి వచ్చే విమానాల్ని ఈ రోజు (సోమవారం) నుంచి కాకుండా మంగళవారం నుంచి షురూ చేయనున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ పేర్కొంది.

ఏపీ సర్కరు కోరినందుకే.. తాము మంగళవారం నుంచి విమాన సర్వీసుల్ని షురు చేస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించినంతనే దరిద్రపుగొట్టు రాజకీయం మొదలైంది. విశాఖకు రావాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని.. ఆయన్ను అడ్డుకునేందుకే విమానాల్ని ఆపేసినట్లుగా తెలుగు తమ్ముళ్లు విచిత్రమైన వాదనను ప్రచారంలోకి తీసుకొచ్చారు. తెలుగు తమ్ముళ్లు చెప్పింది నిజమే అనుకుందాం. ఒకవేళ సోమవారం కాకున్నా.. మంగళవారం నుంచైనా విమాన సర్వీసులు స్టార్ట్ అవుతాయి కదా? ఆ మాత్రం దానికే ఒకరోజు ఆపినందువల్ల ఏపీ సర్కారుకు వచ్చే అదనపు ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నకు సమాధానం లభించదు.

ఈ చిన్న విషయాన్ని వదిలేసి.. ఏదో జరిగిపోతున్నట్లుగా ప్రచారం చేయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ప్రతిది రాజకీయ కోణంలోకి మార్చటం.. దుష్ప్రచారం మంచిది కాదంటున్నారు. విమాన సర్వీసుల్ని ఒకరోజు ఆలస్యంగా స్టార్ట్ చేయమనటానికి సవాలచ్చ కారణాలు ఉంటాయని.. వాటిని వదిలేసి.. బాబు యాంగిల్ లో ఇష్యూను చూపించటం సరికాదంటున్నారు. ఒకవేళ.. రాష్ట్రం చూపించిన కారణాలు సహేతుకంగా లేని పక్షంలో కేంద్రం అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోదు కదా? ఆ చిన్న విషయాన్ని వదిలేసి.. అనవసరమైన యాగీ చేయటం వల్ల మరింత పలుచన కావటం మినహా మరింకేమీ ఉండదన్నది మరచిపోకూడదు.
Tags:    

Similar News