మార్చురీ నుంచి ఫ్లైట్ వ‌ర‌కూ శ్రీ‌దేవి వెంటే ఉన్నాడు

Update: 2018-02-28 05:43 GMT
అతిలోక సుంద‌రిగా అంద‌రికి సుప‌రిచిత‌మైన శ్రీ‌దేవిని గుర్తు ప‌ట్ట‌ని వాళ్లు ఉంటారా? అంటే.. ఉంటార‌న్న నిజంతో పాటు.. ఆమె పార్థిప‌దేహానికి పోస్ట్ మార్టం నిర్వ‌హించిన‌ప్పుడు దుబాయ్ వైద్య‌బృందంతో పాటు.. భార‌తీయుడు ఒక‌రు ఉన్నారు. మార్చురీలో శ‌వ‌ప‌రీక్ష‌లు జ‌రిగిన‌ప్పుడు వైద్యుల‌కు సాయం చేస్తుంటాడు.

ఇంత‌కీ ఆ వ్య‌క్తి ఎవ‌రు? శ్రీ‌దేవిని ఎందుకు గుర్తు ప‌ట్ట‌లేదు?  దుబాయ్ లో అత‌డేం చేస్తుంటాడు?  మార్చురీలో శ్రీ‌దేవిని ఆయ‌న ఎవ‌రికి అప్ప‌గించారు?  ఫైట్ వ‌ర‌కూ శ్రీ‌దేవిని చేర్చిన అత‌నితో క‌పూర్ కుటుంబ స‌భ్యులు ఏమైనా మాట్లాడారా? అన్నది చూస్తే..

కేర‌ళ‌లో పుట్టి.. బ‌తుకు తెరువు కోసం దుబాయ్ వెళ్లిన చాలామంది మాదిరే అష్ర‌ఫ్ త‌మ‌ర‌చ్చేరి. దుబాయ్ లో సామాజిక కార్య‌క‌ర్త‌గా ప‌ని చేస్తున్న ఇత‌గాడు.. మిగిలిన వారి కంటే భిన్నం. ఎందుకంటే ఇత‌డి ప‌ని మిగిలిన వారికి ఏ మాత్రం సంబంధం లేనిది.  మార్చురీలో  ప్ర‌వాసుల శ‌వ‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించే స‌మ‌యంలో  అక్క‌డి వైద్యుల‌కు సాయం చేస్తుంటారు.

పోస్ట్ మార్టం పూర్తి అయ్యాక పార్థిప‌దేహాల‌కు అన్ని ర‌సాయ‌నాల‌తో క‌లిపి బాడీ పాడు కాకుండా చూడ‌టం.. ఒక రూపం తెచ్చి బంధువుల‌కు అప్ప‌గించ‌టం లాంటివి చేస్తారు. ఇప్ప‌టివ‌ర‌కూ 2500 మంది ప్ర‌వాసీ మృత‌దేహాల‌కు చ‌ట్ట‌బ‌ద్ధంగా చేయాల్సిన ప్రక్రియ‌ల్ని చేశారు.

ఆయ‌న‌కు శ్రీ‌దేవి అంటే ఎవ‌రో తెలీదు. ఎందుకంటే.. అత‌ను శ్రీ‌దేవి న‌టించిన సినిమాలు చూడ‌లేదు. శ్రీ‌దేవి ఆయ‌న‌కు విగ‌త‌జీవిగా మాత్ర‌మే తెలిశారు.  అది కూడా.. మార్చురీలో ఆమెను దుబాయ్ ప్ర‌భుత్వ అధికారుల‌తో క‌లిసిన‌ప్పుడు మాత్ర‌మే శ్రీ‌దేవిని చూశాడు. దుబాయ్ ప్ర‌భుత్వ అధికారుల‌తో క‌లిసి ప‌ని చేసేందుకు భార‌త కాన్సులేట్ ఆయ‌న‌కు ప‌వ‌ర్ ఆఫ్ అటార్నీ త‌ర‌హా ఆదేశాల్ని ఇచ్చింది. మార్చురీలోకి బోనీ త‌ర‌ఫున ఆయ‌న మేన‌ల్లుడు సౌర‌భ్ మ‌ల్హోత్రాను అధికారులు అనుమ‌తించారు. శ్రీ‌దేవిని అష్ర‌ఫ్ ఎప్పుడూ చూడ‌క‌పోవ‌టంతో.. సౌర‌భ్ చూపించిన మీద‌ట ఆయన గుర్తించి.. ర‌శీదుల ఆధారంగా మ‌రోసారి చెక్ చేసి.. సంత‌కం పెట్టి త‌న ప‌ని మొద‌లు పెట్టాడు.

మార్చురీ మొద‌లు దుబాయ్ ఎయిర్ పోర్ట్ వ‌ర‌కూ శ్రీ‌దేవి పార్థిపదేహంతో ఉన్నారు. ఎయిర్ పోర్టులో చేర్చే వ‌ర‌కూ క‌పూర్ కుటుంబ స‌భ్యులు ఎవ‌రూ అత‌నితో మాట్లాడ‌లేదు. అనిల్ అంబానీ పంపిన ప్ర‌త్యేక విమానంలో శ్రీ‌దేవి భౌతిక‌కాయం బాక్సును చేర్చి తిరిగి వ‌చ్చేశారు. ఆ స‌మ‌యంలో తెలుగు మీడియాకు చెందిన ఒక ప్ర‌త్యేక ప్ర‌తినిధితో ఆయ‌న మాట్లాడారు.

మ‌ర‌ణం.. దుంఖం అంద‌రికి ఒక్క‌టేన‌ని.. ఒక ధ‌నికుడి కంటే పేద‌వాడికి సాయం చేస్తేనే త‌న‌కు బాగా తృప్తి క‌లుగుతుంద‌న్నారు. శ్రీ‌దేవి కేసు ద‌ర్యాప్తు.. శ‌వ‌ప‌రీక్ష అన్నీ చ‌ట్ట‌ప్ర‌కార‌మే జ‌రిగాయ‌న్న ఆయ‌న‌.. శ్రీ‌దేవి బాడీ త‌ర‌హాలోనే మ‌రో నాలుగు మృత‌దేహాలు త‌మిళ‌నాడు..కేర‌ళ రాష్ట్రాల‌కు వెళ్లాయ‌న్నారు.
Tags:    

Similar News