వైసీపీలో హాట్‌ టాపిక్‌ గా ఆ ఎమ్మెల్యే వ్యవహారం!

Update: 2022-12-26 07:23 GMT
వైసీపీలో నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. వైసీపీ గెలిచిన దగ్గర నుంచి ఆయన స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తున్నారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి నెల్లూరు రూరల్‌ నుంచి ఘన విజయం సాధించారు. దీంతో జగన్‌ ప్రభుత్వంలో మంత్రి పదవిని ఆశించారు. అయితే సామాజికవర్గ సమీకరణాలతో మంత్రి పదవి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ కి దక్కింది. అనిల్‌ కుమార్‌ తన మిత్రుడే కావడంతో కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి కూడా సర్దుకుపోయారు.

అయితే రెండో మంత్రి వర్గ విస్తర ణలో అయినా తనకు పదవి దక్కుతుందని ఆశించారు. ఈసారి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌ రెడ్డి మంత్రి పదవిని ఎగరేసుకుపోయారు. దీంతో కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి వైసీపీ అధిష్టానంపై ఘాటు వ్యాఖ్యలు చేయడంతోపాటు కంటతడి పెట్టుకున్నారు.

తాజాగా నెల్లూరు జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో పనులు పూర్తి కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు మారుతున్నారు.. కలెక్టర్లు మారుతున్నారు.. నియోజకవర్గంలో పనులు మాత్రం చేయడం లేదని మండిపడ్డారు. వరదలు వచ్చినా ఎఫ్‌డీఆర్‌ పనులు చేపట్టలేదని.. దీంతో 150 ఎకరాల పంట కొట్టుకుపోయిందని తెలిపారు. దీనికి ఎవరు బాధ్యులు అని నిలదీశారు. బారాషాహిద్‌ దర్గాకు రూ.10కోట్లను ముఖ్యమంత్రి జగన్‌ మంజూరు చేసినా ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్‌ అనుమతి ఇవ్వడం లేదన్నారు. రావత్‌ దగ్గరకు వెళ్తే కనీసం పట్టించుకోలేదని.. కనీసం కూర్చోమని అని కూడా లేదని.. ఒక ఎమ్మెల్యేకే ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం దారుణమన్నారు.  బీసీ భవన్‌ నిర్మాణ పనులు కూడా మిగిలిపోయాయని.. నిధులు రాకపోవడంతో పనులు చేయలేమని కాంట్రాక్టర్లు చెబుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో సమస్యలు పరిష్కారం కాకపోతే పోరాటం చేస్తానని వెల్లడించారు.

రాష్ట్రంలో కొందరు ఐఏఎస్‌ల వల్లే నిధులు రావడం లేదని ఆరోపించారు. బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కూడా లేవన్నారు.

కాగా గతంలోనూ అధికారులు మురుగునీటి సమస్యను పరిష్కరించడం లేదంటూ మోకాలి లోతు బురదగుంటలో దిగి కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. అలాగే గతంలో ఒక మహిళా ఎంపీడీవో ఇంటికి కరెంటు, నీటి సరఫరా నిలిపి వేయించారని ఆయనపై ఆరోపణలు వ్యక్తమయ్యాయి.

వాస్తవానికి నెల్లూరు జిల్లా వైసీపీలో అనిల్‌ కుమార్, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి మంచి మిత్రులుగా ఉండేవారు. వీరిద్దరినీ నెల్లూరు బ్రదర్స్‌ అని ముద్దుగా పిలిచేవాళ్లు. అయితే ఆ తర్వాత పరిస్థితుల్లో వీరిద్దరి మధ్య విభేదాలు పొడసూపాయని టాక్‌. ఇక ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డితోనూ గతంలో కోటంరెడ్డి ఉప్పూనిప్పుగా ఉండేవారు. అయితే ఇటీవల కాలంలో ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయని చెబుతున్నారు.

గతంలో తనకు సొంత పార్టీలోనే శత్రువులున్నారని కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశారు. తరచూ పార్టీలు మారే నేతలు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

ఇప్పుడు తాజాగా అధికారులపైన చేసిన విమర్శలు హాట్‌ టాపిక్‌ గా మారాయి. మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో మాట్లాడుతున్నారా లేక నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించడం లేదని హాట్‌ కామెంట్స్‌ చేస్తున్నారా అనే చర్చ జరుగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News