ఈ కంపెనీ ఫిలాసఫీనే డిఫరెంట్.. వారానికి 3 రోజులే పని

Update: 2021-10-05 03:37 GMT
అందరు నడిచే దారిలో నడిస్తే మజా ఏముంటుంది? అందుకే ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్లటంలో ఉన్న ఆనందం.. కిక్కు చాలా మందికి రోటీన్ గా ఉంటే అస్సలు నచ్చదు. ఇప్పుడు ప్రస్తావించే కంపెనీ ఈ కోవకు చెందిందే. సాధారణంగా వారానికి ఆరు రోజులు కొన్ని కంపెనీల్లో.. ఐదు రోజులు మరికొన్ని కంపెనీల్లో పని దినాలు ఉంటాయి. కానీ.. అందుకు భిన్నంగా వారానికి కేవలం మూడు రోజులు మాత్రమే తమతో పని చేయాలని కోరుతోంది. ఇంతకూ ఆ కంపెనీ పేరేమిటి? అదెక్కడ ఉంది? అందులో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు? లాంటి ఆసక్తికర విషయాల్లోకి వెళితే..

వారానికి ఐదారురోజులు కాకుండా ఎంచక్కా మూడు రోజులు మాత్రమే పని చేసే అవకాశాన్ని కల్పిస్తోంది బెంగళూరుకు చెందిన ఫిన్ టెక్ స్టార్టప్ కంపెనీ స్లైస్. సరికొత్త ఐడియాతో వినూత్న పని తీరుకు శ్రీకారం చుడుతోంది. ఈ కంపెనీలో పని దినాలు వారానికి మూడు రోజులు మాత్రమే. ఎందుకిలా అంటే.. ఈ కంపెనీ ఫిలసఫీనే కాస్తంత భిన్నం. ప్రతి ఒక్కరు ఒక్క ఉద్యోగం మాత్రమే చేస్తూ పరిమితం కాకూడదని.. తమ దగ్గర జాబ్ చేస్తూనే.. తమకున్న ఇతర హామీల్ని కూడా కొనసాగించొచ్చన్నది అతగాడి వాదన.

మార్కెట్లో ఉద్యోగులకు ఇచ్చే జీతంతో పోలిస్తే.. 80 శాతం మొత్తాన్ని ఇస్తామని హామీ ఇస్తున్న ఈ కంపెనీ వ్యవస్థాపకుడు 28 ఏళ్ల రాజన్ బజాజ్ ఐడియాలజీ వింటే రోటీన్ కు భిన్నంగా అనిపించక మానదు. ఉద్యోగం చేస్తూనే నచ్చినపని కూడా చేయటమే ఫ్యూచర్ వర్క్ అనే మాటను ఇతగాడు చెబుతుంటాడు. ఇప్పటివరకు తమ కంపెనీలో 450 మంది ఉద్యోగులు ఉన్నారని.. రానున్న మూడేళ్లలో మరో వెయ్యి మందిని జాబ్ లు ఇస్తామని కంపెనీ చెబుతోంది.

ఇంజినీర్లు.. ప్రొడక్ట్ మేనేజర్లను రిక్రూట్ చేసుకోవాలని భావిస్తోంది. వారానికి మూడు రోజులు పని చేసినా.. ఉద్యోగులు మాత్రం మిగిలిన కంపెనీల మాదిరి లభించే అన్ని ప్రోత్సహాకాలు లభిస్తాయని స్పష్టం చేయటం గమనార్హం. ఇదంతా విన్న తర్వాత.. ఈ కంపెనీలో ఉద్యోగం వస్తే బాగుండన్న భావన కలుగుతుంది కదూ?
Tags:    

Similar News