కోటి దాటేసిన హైదరాబాద్ జనాభా.. ఈ విషయాన్ని చెప్పిందెవరో తెలుసా?

Update: 2023-04-20 09:21 GMT
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ను గుర్తిస్తూ దీనికి సంబంధించిన వివరాల్ని ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం అంచనా వేయటం తెలిసిందే. ఈ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాలు ఆయా నగరాల్లోని జనాభా పెరుగుదల గురించిన అంచనాను వెల్లడించింది. ఈ సందర్భంగా ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. దేశంలో అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది.

మొన్నటివరకు నగర జనాభా కోటి కంటే తక్కువ అన్న విషయాన్ని సరి చేసి ప్రస్తుతం హైదరాబాద్ మహానగర జనాభా కోటికి పైనే అంటూ కొత్త అంచనాను వెల్లడించింది. జనాభా పరంగా చూస్తే భారత్ లో ఆరో అతి పెద్ద నగరంగా హైదరాబాద్ నిలిస్తే.

ప్రపంచంలో 34వ స్థానంలో నిలవటం గమనార్హం హైదరాబాద్ మహానగర జనాభా 1.05 కోట్లను దాటేసిందన్న విషయాన్ని వెల్లడించింది. 2035 నాటికి హైదరాబాద్ మహానగర జనాభా 1.41 కోట్లకు చేరుకుంటుందన్న అంచనాను వేసింది.

1950లో 10 లక్షలకు పైగా ఉన్న నగర జనాభా 1975 నాటికి 20 లక్షలకు చేరగా. ఆ తర్వాత కేవలం 15 ఏళ్ల కాలంలో 40 లక్షలకు (1990 నాటికి) చేరుకుంది. తర్వాత ఇరవై ఏళ్లకు అంటే 2010లో 80లక్షలకు చేరినట్లుగా పేర్కొంది. గతంలో అంటే జీహెచ్ఎంసీకి పూర్వంగా ఉన్న ఎంసీహెచ్ పరిధి 170 చదరపు కిలోమీటర్ల పరిధి మాత్రమే ఉండగా. జీహెచ్ఎంసీ ఏర్పాటుతో దీని విస్తీర్ణం 650 చదరపు కిలోమీటర్ల పరిధికి నగరం విస్తరించింది. అదే అవుటర్ రింగురోడ్డును పరిగణలోకి తీసుకుంటే వెయ్యి చదరపు కి.మీ విస్తీర్ణం ఉంటుంది.

ఏడాది వ్యవధిలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు వచ్చేస్తున్న వారి సంఖ్య 4.07 లక్షలుగా ఉంటే. వివిధ రాష్ట్రాల నుంచి వలసలుగా వచ్చే వారి సంఖ్య 88,216గా అంచనా వేశారు. కోటి అంకెను దాటేసిన హైదరాబాద్ జనాభాలో పద్నాలుగేళ్ల లోపు పిల్లల దాదాపుగా 25 శాతం వరకు ఉంటారని పేర్కొంది. నగర జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న జనాభా 15-64 ఏళ్ల మధ్యలో ఉన్న వారేనని పేర్కొంది.

Similar News