అట్టపెట్టె మోసిన కామెరూన్ ఫోటో అసలుకథ

Update: 2016-07-14 10:34 GMT
సోషల్ మీడియా విస్తృతి అవుతున్న కొద్దీ రకరకాల వార్తలు.. ఫోటోలు షికార్లు చేస్తున్నాయి. ఒక ఫోటోను ఎవరో ఒకరు షేర్ చేయటం.. దానిపై ఏదో కామెంట్ చేయటం దాన్ని నమ్మే వాళ్లు నమ్ముతూ.. నమ్మనోళ్లు సందేహాలు వ్యక్తం చేస్తూ షేర్ల మీద షేర్లు చేయటం.. అది కాస్తా వైరల్ గా మారటం ఈ మధ్య కాలంలో తరచూ చేసుకుంటున్న పరిస్థితి.

తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. బ్రటన్ ప్రధానిగా రాజీనామా చేసిన డేవిడ్ కామెరూన్ కుటుంబం తన అధికార నివాసాన్ని ఖాళీ చేయటమే కాదు.. పెద్ద పెట్టెను తానే స్వయంగా మోసుకెళుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హడావుడి చేస్తుంది. దాని వెనుక వాహనంలో కొందరు సామాను దించుతున్నట్లుగా ఉంది.

బ్రిటన్ లాంటి దేశానికి ప్రధానిగా సేవలు అందించిన వ్యక్తి చేత పెట్టెలు మోయిస్తారా? అంటూ పలువురు తిట్ల దండకం అందుకుంటున్న పరిస్థితి. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ కామెరూన్ పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్న ఫోటో వెనుక అసలు కథ బయటకు వచ్చేసింది. తాజాగా వైరల్ అయిన ఫోటో ఇప్పటిది కాదని.. దాదాపు తొమ్మిదేళ్ల కిందటిదిగా ఒక ప్రముఖ మీడియా సంస్థ తేల్చింది.

తొమ్మిదేళ్ల క్రితం లండన్ లోని నార్త్ కెన్సింగ్టన్ కు కామెరూన్ మారుతున్న వేళ తీసిన ఫోటోను ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేయటంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని.. ఫోటోలో కనిపిస్తున్న కామెరూన్ కు ఇప్పటికి మధ్య వయసు తేడా స్పష్టంగా కనిపిస్తుందని చెబుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి పోస్టింగ్ ను.. ప్రతి ఫోటోను నమ్మకూడదని చెప్పటానికి ఇంతకు మించిన ఉదాహరణ ఉండదని చెప్పాలి.
Tags:    

Similar News