పాపం ఈటల.. చీలిపోయిన సోషల్ మీడియా!

Update: 2021-05-01 16:30 GMT
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ నుంచి తొలగించబడిన ఈటల రాజేందర్ చుట్టూ ఇప్పుడు రాజకీయం నడుస్తోంది. సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇక బీజేపీ, కాంగ్రెస్ నేతలు సైతం ఈటలపై సానుభూతి మాటలు మాట్లాడేసరికి ఇదే చర్చనీయాంశమైంది.

అయితే సోషల్ మీడియా సాక్షిగా నెటిజన్లు విడిపోయారు. కొందరు అన్యాయంగా ఈటల రాజేందర్ ను పొగబెట్టి తొలగిస్తున్నారని టీఆర్ఎస్ సర్కార్ పై మండిపడుతుండగా.. మరికొందరు ఆయన రైతుల భూముల కబ్జాలు చేశారని తేలాకే కేసీఆర్ తొలగించారని ఆరోపిస్తున్నారు.

అయితే తెలంగాణ తొలి ఉద్యమకారుడు.. నాడు వైఎస్ఆర్ ప్రలోభ పెట్టినా కూడా పార్టీ మారకుండా గులాబీ జెండా పట్టుకున్న ఈటల రాజేందర్ ను విమర్శించడానికి పగవాళ్లు, టీఆర్ఎస్ వాళ్లు కూడా పెద్దగా సాహసించడం లేదు. సోషల్ మీడియాలోనూ ఆయనపై సానుభూతియే వ్యక్తమవుతోంది.

ఇక దీనిపై టీఆర్ఎస్ క్యాడర్, నేతలు కూడా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ఇతరులు ఈటెలకు మద్దతుగా మాట్లాడుతున్నా.. గులాబీ అధిష్టానానికి భయపడి టీఆర్ఎస్ నేతలు ఎవరూ నోరు మెదపడం లేదు.ఇక కేసీఆర్ వ్యూహాత్మకంగా ఆలె నరేంద్ర, విజయశాంతి, రాజయ్య సహా పలువురిని ఇలానే పార్టీనుంచి గెంటివేశాడని.. ఇప్పుడు ఈటల వంతు వచ్చిందని పోస్టులు పెడుతున్నారు.

తెలంగాణలోని ప్రధాన మీడియా మాత్రం ఆయన అవినీతి చేశాడని..అందుకే తీసేస్తున్నారని అంటున్నా సగటు తెలంగాణ వాదులు మాత్రం దీన్ని జీర్ణించుకోవడం లేదు. ఈటలకు అన్యాయం జరుగుతోందన్న ఆవేదననే సోషల్ మీడియాలో వెల్లువెత్తుతోంది.
Tags:    

Similar News