కోర్టుగా మారిన యూపీ అసెంబ్లీ సీన్.. రానున్న రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో పక్కానట!

Update: 2023-03-04 11:19 GMT
అసెంబ్లీలు చట్టాలు చేస్తాయి. న్యాయస్థానాలు తీర్పులు ఇస్తాయి. కానీ.. అసెంబ్లీలో పంచాయితీ పెట్టి తీర్పులు ఇవ్వటమే కాదు.. అక్కడికక్కడే శిక్షలు కూడా ఫైనల్ చేస్తే? అదెలా కుదురుతుంది? అనుకోవచ్చు. కానీ.. అలాంటి అరుదైన సన్నివేశమే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో తాజాగా చోటు చేసుకుంది. సంచలనంగా మారిన ఈ ఉదంతం గురించి విన్న వారంతా రానున్న రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సీన్ రిపీట్ అయినా ఆశ్చర్యం లేదంటున్నారు. తెలంగాణలో ఎలా ఉన్నా.. ఏపీలో మాత్రం ఇలాంటివి పలుమార్లు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.

ఇంతకూ జరిగిందేమంటే.. దాదాపు 19 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే పట్ల అమర్యాదగా ప్రవర్తించిన ఆరుగురు పోలీసుల్ని యూపీ అసెంబ్లీకి పిలిపించి మరీ శిక్షలు వేసిన ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. 2004లో బీజేపీ ఎమ్మెల్యేగా వ్యవహరించిన సలీల్ విష్ణోయ్.. ఆయన మద్దతుదారులపై అప్పట్లో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఆ సమయంలో సమాజ్ వాదీ పార్టీఅధికారంలో ఉంది. దీనిపై ఆయన అప్పట్లో సభాహక్కుల కమిటీకి కంప్లైంట్ చేశారు. దానికి సంబంధించిన నివేదికను తాజాగా బయటకు తీశారు. అప్పట్లో లాఠీఛార్జ్ జరిపిన ఆరుగురు పోలీసులకు శిక్ష విధించాలని సిఫార్సు చేసింది.

అప్పట్లో పోలీసుల లాఠీ చార్జ్ లో దెబ్బలు తిన్న సలీల్.. ఇప్పుడు ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కమిటీ ఇచ్చిన రిపోర్టును అనుసరించి తాజాగా యూపీ అసెంబ్లీకి సదరు పోలీసుల్ని పిలిచారు. వీరిపై చర్యలకు శాసన సభా వ్యవహారాల మంత్రి సురేష్ కుమార్ ప్రతిపాదించగా.. స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కాంగ్రెస్.. బీఎస్సీతో సహా పలు పార్టీలుస్పష్టం చేశాయి.

దీంతో స్పీకర్ సతీశ్ మహానా తన తీర్పును వెలువరించారు. లక్ష్మణ రేఖ అతిక్రమించిన పోలీసు సిబ్బందికి అసెంబ్లీ ప్రాంగణంలోని ఒక గదిని జైలుగా భావించి.. ఒక రోజు వారిని అందులో ఉంచాలని ఆదేశించారు. శుక్రవారం అర్థరాత్రి వరకు వారిని అక్కడే ఉంచాలని.. ఈ సందర్భంగా పోలీసుల్ని బాగా చూసుకోవాలని.. వారికి ఆహారం అందజేయాలని స్పీకర్ పేర్కొన్నారు. స్పీకర్ తీర్పువెలువరించే వేళలో.. అప్పట్లో అధికారపక్షంగా వ్యవహరించిన సమాజ్ వాదీ.. దాని మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్ దళ్ సభ్యులు సభలో లేకపోవటం గమనార్హం. ఇదిలా ఉండగా.. ఈ తీర్పు నేపథ్యంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారితే మాత్రం.. ఇలాంటివి ఖాయంగా జరిగే అవకాశం ఉందంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News