ఆ రాష్ట్ర క్రీడా మంత్రి ఐపీఎల్ వేలంలో పాల్గొన్నాడు..: ఎందుకంటే..?

Update: 2022-02-03 04:11 GMT
ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిథి అతడు.. ఆ తరువాత అతని టాలెంట్ చూసి మంత్రి పదవి ఇచ్చారు.. ఓ వైపు మంత్రిగా ప్రజల మధ్య ఉంటూనే.. మరోవైపు క్రికెటర్ గా కొనసాగుతున్నాడు. చిన్నప్పటి నుంచి ఆడిన క్రికెట్ తన భవిష్యత్తును మార్చేసింది. అసలు మంత్రి కావడానికి కూడా ఆ క్రికెటే కారణం. దీంతో ఆయన మంత్రిగా కొనసాగుతూనే  క్రికెటర్ గా గ్రౌండ్లోకి దిగుతున్నాడు. త్వరలో జరిగే ఐపీఎల్ వేలంలో కనీసం రూ.50 లక్షలతో వేలంలో పాల్గొనబోతున్నాడు. అయితే అతనిని ఎవరు దక్కించుకుంటారోనన్న ఆసక్తి క్రీడాభిమానుల్లో నెలకొంది. ఇంతకీ ఎవరా మంత్రి.. క్రికెటర్..?

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. ఈ పార్టీకి చెందిన మనోజ్ తివారి క్రీడాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అప్పటికే క్రికెటర్ గా పేరు తెచ్చుకున్న మనోజ్ తివారికి టీఎంసీ టికెట్ ఇచ్చి గెలిపించుకుంది. గతేడాది రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మనోజ్ తివారి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ తరువాత క్రెకెట్లో తన టాలెంట్  ను చూసిన మమతా బెనర్జీ  అతనికి క్రీడా మంత్రిత్వ శాఖను అప్పగించింది.

భారత్ జట్టు తరుపున 12 వన్డేలు, 3 టీ 20లు ఆడిన మనోజ్ తివారి క్రికెటర్ గా కొనసాగుతూనే రాజకీయాల్లోకి వచ్చారు. ఓ వైపు మంత్రిగా ప్రజలకు సేవ చేస్తూనే సమయం దొరికినప్పుడల్లా క్రికెట్ ఆడుతున్నారు. గతంలో కోల్ కతా, పుణె, ఢిల్లీ, పంజాయ్ తరుపున ఐపీఎల్ లో ఆడిన మనోజ్ తివారికి కొన్నాళ్ల పాటు ఏ జట్టూ అవకాశం ఇవ్వలేదు. అయినా మనోజ్ తివారి ఐపీఎల్ వేలంలో పాల్గొంటూనే వస్తున్నారు. ఈసారి కూడా వేలంలో పాల్గొనేందుకు రెడీ అయ్యారు.

అయితే మంత్రిగా ఉన్న మనోజ్ తివారీ ఈసారి ఏ జట్టయినా అవకాశం ఇస్తుందా..? అనేది చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు సరదాగా క్రికెట్ ఆడుతూ... మరోవైపు ప్రజా సమస్యలపై మంత్రి దృష్టిపెట్టగలరా..? అని కొందరు కామెంట్లు చేస్తూనే ఉన్నారు. అయితే బయటి ప్రపంచంలో మనోజ్ తివారి మంత్రి అయినా.. మైదానంలోకి వెళితే ఆటాడే వ్యక్తిలాగే చూస్తారని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఏదీ ఏమైనా ఒకవేళ మనోజ్ తివారి ఏదైనా జట్టు దక్కించుకుంటే మాత్రం ఈసారి ఐపీఎల్ ఆసక్తిగా మారే అవకాశం ఉందని అనుకుంటున్నారు.
Tags:    

Similar News