కరోనా లెక్కలపై తెలంగాణ సర్కార్ కు సుప్రీంలో ఊరట

Update: 2020-12-16 11:54 GMT
తెలంగాణలో కరోనా టెస్టులు, గణాంకాల, చికిత్స, ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక బిల్లులకు సంబంధించిన నివేదికల విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిని హైకోర్టు పలుమార్లు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. కోర్టులంటే తెలంగాణ ప్రభుత్వానికి గౌరవం లేదని, కరోనా కేసులు, మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారని హైకోర్టు గతంలోనే చాలాసార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం తీరు మారకపోవడంతో హైకోర్టు సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలోనే తమ ఆదేశాలు పాటించడం లేదన్న కారణంతో తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌కు హైకోర్టు గతంలో కోర్టు ధిక్కరణ నోటీసులిచ్చింది. అయితే, ఈ ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై నేడు వాదనలు విన్న సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా టెస్టుల అంశంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన కోర్టు ధిక్కరణ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దీంతో, సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్‌కు ఊరట లభించినట్టయింది.

కాగా, కరోనా పరీక్షల విషయంలో మిగతా రాష్ట్రాల కన్నా తెలంగాణ ఎందుకు వెనకబడి ఉందని ప్రభుత్వాన్ని గతంలో హైకోర్టు ప్రశ్నించింది. తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుుగుతున్నప్పటికీ పీహెచ్ సీలు, అనుమతిచ్చిన ల్యాబుల్లో తక్కువ పరీక్షలు ఎందుకు జరుగుతున్నాయంటూ అసహనం వ్యక్తం చేసింది. తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య చెబుతున్నదానికంటే ఎక్కువగా ఉంటుందని హైకోర్టు అభిప్రాయపడింది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గి రికవరీ పెరిగిందన్న తెలంగాణ వైద్యారోగ్యశాఖ అధికారి సమాధానంతో హైకోర్టు సంతృప్తి చెందలేదు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు ఎక్కువ చేయనప్పుడు కేసులు ఎలా తగ్గుతాయని ధర్మాసనం ప్రశ్నించింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా టెస్ట్ ల్యాబ్‌లు తక్కువగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేసింది. ల్యాబ్‌ల సంఖ్య పెంచాలని, అపుడే ఎక్కువ పరీక్షలు చేసే వీలుంటుందని అభిప్రాయపడింది. ఆసుపత్రుల్లో వెంటిలేటర్లకు సంబంధించి సరైన సమాచారం ఇవ్వలేదని,తప్పుడు లెక్కలతో కోర్టును ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌కు హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులిచ్చింది.
Tags:    

Similar News