బెంగాల్లో ఆరిపోయిన క‌మ్యూనిస్టుల ‘జ్యోతి’!

Update: 2021-05-03 11:30 GMT
దేశవ్యాప్తంగా క‌మ్యూనిస్టుల ప‌రిస్థితి ఎలా ఉన్నా.. బెంగాల్ లో ప‌రిస్థితి వేరే అన్న‌ట్టుగా ఉండేది. అవును మ‌రి.. అక్క‌డ ఏకంగా.. 34 ఏళ్ల‌పాటు ఏక‌ఛ‌త్రాధిప‌త్యంగా పాల‌న సాగించారు కామ్రేడ్లు. 1977 నుంచి 2011 వ‌ర‌న‌కూ వారిదే అధికారం. ముఖ్య‌మంత్రి జ్యోతిబ‌సు పాల‌న‌లో క‌మ్యూనిస్టుల‌ను గుండెల్లో పెట్టుకున్నారు బెంగాలీలు. కానీ.. వృద్ధాప్యంతో జ్యోతిబ‌సు దిగిపోయిన త‌ర్వాత ప‌రిస్థితులు వేగంగా మారుతూ వ‌చ్చాయి.

జ్యోతిబ‌సు స్థానంలో బుద్ధ‌దేవ్ భ‌ట్టాచార్య సీఎం ప‌గ్గాలు చేప‌ట్టారు. ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలోనే నందిగ్రామ్ లో చారిత్రక పోరాటం సాగింది. నానో కార్ల ఫ్యాక్ట‌రీని నందిగ్రామ్ లో పెట్టాల‌ని క‌మ్యూనిస్టు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇందుకోసం భూసేక‌ర‌ణ చేప‌ట్టింది. దీన్ని స్థానిక ప్ర‌జ‌లు వ్య‌తిరేకించారు. అప్పుడు వారికి మ‌ద్ద‌తుగా నిలిచింది మ‌మ‌తా బెన‌ర్జీ. వెన్నుచూప‌ని పోరాటం సాగించింది. ఫ‌లితంగా.. ప్ర‌జ‌లంతా ఆమె వెంట చేరారు.

ఇక మూడు ద‌శాబ్దాలు అధికారం కొన‌సాగిస్తున్న పార్టీపై స‌హ‌జ వ్య‌తిరేక కూడా ఉండిపోయింది. ఇవ‌న్నీ క‌ల‌గ‌లిసి బెంగాల్లో క‌మ్యూనిస్టుల ప‌త‌నం ప్రారంభ‌మైంది. 2011లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ భారీ మెజారిటీతో విజ‌యం సాధించింది. ఆ ఎన్నిక‌ల్లో క‌మ్యూనిస్టు పార్టీల కూట‌మికి కేవ‌లం 42 సీట్లు మాత్ర‌మే వ‌చ్చాయి.

ఆ త‌ర్వాత 2016లోనూ ఇదే ఫ‌లితం పున‌రావృత‌మైంది. లెఫ్ట్ కూట‌మికి మ‌రిన్ని సీట్ల‌లో కోత ప‌డింది. కేవ‌లం 27 స్థానాలకు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లోనూ ఇదే ప‌రిస్థితి. అయితే.. రెండుసార్లు అధికారానికి దూరంగా ఉన్నారు కాబ‌ట్టి.. ఈ సారి ప‌రిస్థితిలో మార్పు వ‌స్తుందేమోన‌ని ఆశించారు చాలా మంది. కానీ.. ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ఖాతా కూడా తెర‌వ‌లేక‌పోయింది క‌మ్యూనిస్టుల కూట‌మి. లెఫ్ట్ కూట‌మిలో సీపీఎం సీపీఐ, ఫార్వ‌ర్డ్ బ్లాక్‌, రివ‌ల్యూష‌న‌రీ సోష‌లిస్టు పార్టీలు ఉన్నాయి. సీపీఎం నేతృత్వం వ‌హిస్తుంది.

జ్యోతిబ‌సు ఉన్నంత కాలం ఎదురు లేకుండా మెరిసిపోయిన ఎర్ర‌జెండా.. ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత ప‌త‌నం వైపు ప‌య‌నించ‌డం స్ప‌ష్టంగా గ‌మ‌నించ‌వ‌చ్చు. ఒక‌నాడు దేదీప్య‌మానంగా వెలిగిపోయిన ఎర్ర‌జెండా.. నేడు పూర్తిగా వెలిసిపోవ‌డం గ‌మ‌నార్హం. బెంగాల్లో ఈ ప‌రిస్థితి ఎన్నాళ్లు కొన‌సాగుతుందో ఎవ్వ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి.
Tags:    

Similar News