తెలంగాణ రైతుల‌కు డ‌బుల్ బొనాంజా!

Update: 2019-02-15 04:14 GMT
తెలంగాణ రైతుల‌కు ఇప్పుడు నిజంగానే డ‌బుల్ బొనాంజా ల‌భించిన‌ట్టేన‌ని చెప్పాలి. ఇటు కేసీఆర్ స‌ర్కారు నుంచి ఇప్ప‌టికే వారికి ఓ ఘ‌న‌మైన వ‌రం రాగా... ఇప్పుడు కేంద్రం నుంచి కూడా మ‌రో వ‌రం చేతికంద‌నుంది. మొత్తంగా తెలంగాణ రైతుల‌కు బంపర్ ఆఫ‌ర్ చేతికంద‌నుంది. అయినా ఈ  డ‌బుల్ బొనాంజా ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... రైతుల‌కు సాగు సాయం అందించేందుకు దేశంలోనే తొలిసారిగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న టీఆర్ ఎస్ అధినేత‌ - తెలంగాణ సీఎం కల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు రైతు బంధు పేరిట స‌రికొత్త ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టిన సంగతి తెలిసిందే. ఏడాదికి ఒక్కో ఎక‌రాకు రూ.8వేల చొప్పున సాయం అందించేందుకు ఉద్దేశించిన ఈ ప‌థ‌కంలో... ల‌బ్ధిదారులైన రైతులు ఆ సొమ్మును తిరిగి చెల్లించాల్సిన ప‌ని లేదు. అంటే... తెలంగాణ స‌ర్కారు నుంచి అందే ఈ సాయం ఫ్రీ అన్న‌మాట‌.

ఈ ప‌థ‌కంతోనే కేసీఆర్ ఇటీవ‌ల ముగిసిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బంప‌ర్ మెజారిటీతో విజ‌యం సాధించారు. కేసీఆర్ విన్నింగ్ మంత్రాన్ని ప‌రిశీలించిన దేశంలోని ఇత‌ర రాష్ట్రాల‌తో పాటు కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు కూడా ఈ ప‌థ‌కాన్ని పోలిన ప‌థ‌కాల అమ‌లుకు న‌డుం బిగించాయి. ఈ క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వం... పీఎం కిసాన్ స‌మ్మాన్ పేరిట ఓ కొత్త ప‌థ‌కానికి తెర తీసింది. ఈ ప‌థకం ద్వారా ఒక్కో రైతు ఖాతాలో ఏడాదికి రూ.6 వేల చొప్పున జ‌మ కానున్నాయి. మ‌రి ఈ పథ‌కం అమ‌లు ఎలా అన్న విష‌యంపై కేంద్రం క‌స‌ర‌త్తులు చేస్తోంది. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లోని రైతుల వివ‌రాల‌ను పంపించాల‌ని ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు లేఖ‌లు రాసింది. ఇప్ప‌టికే తెలంగాణ స‌హా ప‌లు రాష్ట్రాలు ఈ వివ‌రాల‌ను కేంద్రానికి అంద‌జేశాయి కూడా.

ఈ క్ర‌మంలో నేడు తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ అద‌న‌పు కార్య‌ద‌ర్శి వ‌సుధా మిశ్రా తెలంగాణ‌కు వ‌చ్చారు. రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారుల‌తో స‌మావేశ‌మై ఆమె... ప‌థ‌కం అమ‌లుపై మీడియాతోనూ మాట్లాడారు. తెలంగాణ స‌ర్కారు అమ‌లు చేస్తున్న రైతు బంధు - కేంద్రం ప్ర‌క‌టించిన పీఎం కిసాన్ స‌మ్మాన్ కు ఎలాంటి సంబంధం లేద‌ని తేల్చిపారేశారు. అంటే... తెలంగాణ స‌ర్కారు నుంచి రైతు బంధు సొమ్మును అందుకునే టీ రైతులకు ఇప్పుడు కేంద్రం అందించే పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధులు కూడా అందుతాయ‌న్న మాట‌. అంటే తెలంగాణ రైతుల‌కు డ‌బుల్ బొనాంజానే క‌దా. ఇప్ప‌టికే రైతు బంధు కింద పెట్టుబడి సాయాన్ని అందుకున్న తెలంగాణ రైతుల‌కు ఇప్పుడు కేంద్ర ప‌థ‌కం నిధులు కూడా జ‌మ కానున్నాయి. ఈ నెలాఖ‌రు నాటికే ఈ నిధులు తెలంగాణ రైతుల ఖాతాల్లో ప‌డిపోతాయ‌ని మిశ్రా తెలిపారు.



Tags:    

Similar News