న్యాయంగా మాట్లాడితే దక్షిణాఫ్రికా వాదనలో నిజం ఉంది కదా బాస్?

Update: 2021-11-29 09:30 GMT
ప్రపంచం మొత్తానికి మూడేలా చేసిన అతి పెద్ద విలన్ చైనా. కరోనా మహమ్మారి విషయంలో ఆ దేశం వ్యవహరించిన తీరు చూసినప్పుడు.. బలమున్నోడి విషయంలో ప్రపంచంలో వ్యవహరించే తీరుకు.. అట్టే బలం లేనోడి విషయంలో స్పందించే తీరులో తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటుంది.

కరోనా మహమ్మారి పుట్టి పెరిగి.. ప్రపంచానికి సరఫరా చేసిన క్రెడిట్ చైనాదే. ఈ విషయంలో మరో మాటకు అవకాశం లేదు. ప్రమాదకరమైన వైరస్ విరుచుకుపడిన వేళ.. ప్రపంచాన్ని అలెర్టు చేయాల్సిన చైనా.. అందరి కొంపల మీదకు వచ్చేలా చేసిన తర్వాత కానీ దీని తీవ్రత ఎంతన్న విషయం అర్థం కాలేదు. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. మాట వరసకు చైనా మీద వ్యాఖ్య చేయటమే తప్పించి.. ప్రపంచం మొత్తం ఒక తాటి మీద నిలబడి చేసిందేమీ లేదు.

కరోనాకు సంబంధించి మొదటి.. రెండో వేవ్ లు ముగిసి.. మూడో వేవ్ విరుచుకుపడేందుకు ‘ఒమైక్రాన్’ వేరియంట్ తో విరుచుకుపడేందుకు సిద్ధమవుతున్న వేళ.. ఈ వేరియంట్ ఎక్కువగా ఉన్న సౌతాఫ్రికా మీద ప్రపంచ దేశాలు వ్యవహరిస్తున్న తీరును ఆ దేశం తీవ్రంగా తప్పు పడుతోంది.

తమ దేశంలో గుర్తించిన ఒమైక్రాన్ వేరియంట్ కారణంగా తమ దేశానికి వచ్చే అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని పలు దేశాలు రద్దు చేయటాన్ని తీవ్రంగా తప్పు పడుతోంది. ఇప్పటివరకు 18 దేశాలు తమ దేశంపై ప్రయాణ నిషేధాన్ని విధించటాన్ని దక్షిణాఫ్రికా వైద్య సంఘం తప్పు పడుతోంది. ఇది అనాలోచిత చర్యగా అభివర్ణిస్తోంది.

ప్రపంచం కీలకమైన వైద్య సమాచారాన్ని పారదర్శకంగా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ తరహా విధానాల్ని మానుకోవాలని హితవు పలికింది. దక్షిణాఫ్రికాలో బయటపడిందని చెబుతున్న ఒమైక్రాన్ వేరియంట్ ను ఆందోళనకర రకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చిన నేపథ్యంలో ఆ దేశంతో పలు దేశాలు బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ ఛైర్ పర్సన్ ఏంజెలిక్ కోయెట్జీ రియాక్టు అయ్యారు. కొత్త వేరియంట్ నుంచి ముప్పు ఏ స్థాయిలో ఉందన్న విషయంపై ఇప్పటివరకు తగినంత సమాచారం లేకుండానే 18 దేశాలు ట్రావెల్ బ్యాన్ విధించటాన్ని తప్పు పట్టారు.

ఈ రకాన్ని కనుగొన్న తమను విలన్లుగా చూడటం సరికాదని.. ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదన్నారు. ఈ వేరియంట్ ను కనుగొన్నందుకు.. ఆ వివరాల్ని ప్రకటించినందుకు తమ దేశాన్ని ప్రశంసించాలే కానీ ఇలా వ్యవహరించకూడదన్న వాదనలో న్యాయం ఉందని చెప్పాలి. ప్రపంచానికి కరోనా మంట పెట్టేసిన చైనా.. ఏ రోజు కూడా పారదర్శకంగా వ్యవహరించింది లేదు. అలాంటిది.. ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెప్పే వారి మీద అమెరికా.. ఐరోపా దేశాలు ఈ తరహా బ్యాన్ విధించటం ద్వారా.. రేపొద్దున ఇతరదేశాలు సైతం గుట్టుగా వ్యవహరిస్తాయే తప్పించి.. ఉన్నది ఉన్నట్లుగా చెప్పే ప్రయత్నం చేయదన్నది మర్చిపోకూడదు.

అంతేకాదు.. తమ శాస్త్రవేత్తలు అత్యంత అప్రమత్తంగా ఉండి జన్యుక్రమ పరిశీలన జరపటంతోనే ఇది బయటపడి ఉండొచ్చని.. ఐరోపా దేశాలు దీన్ని గుర్తించకపోవచ్చన్న లాజిక్ కూడా అతికినట్లే ఉందని చెప్పాలి. ఒమైక్రాన్ లక్షణాలు డెల్టా వేరియంట్ మాదిరి కాకుండా బీటా రకంగా ఉన్నాయని.. దీని బారిన యూత్ అందునా పురుషుల్లో తీవ్ర అలసట.. ఒళ్లు నొప్పులు.. తలనొప్పి.. గొంతు సమస్యలు లాంటి కొత్త లక్షణాల్ని గుర్తించామన్నారు.

అలాంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి పరీక్షలు జరిపితే పాజిటివ్ గా తేలిందన్నారు. ఈ లక్షణాలేవీ డెల్టా రకంతో లింకు లేకపోవటంతో కొవిడ్ సలహా మండలిని అప్రమత్తం చేయగా.. వారు మరింత లోతుగా అధ్యయనం చేసి.. కొత్త వేరియంట్ వివరాల్ని వెల్లడించారన్నారు. ఏ దేశమైనా తమ ప్రజల్ని కాపాడుకోవాలంటే వారిని అప్రమత్తం చేయాలన్నారు. అంతే తప్పించి అనాలోచితంగా స్పందించటంసరికాదన్నారు.

ఈ వేరియంట్ ఎంత ఆందోళనకరమైనదన్న విషయంపై తమ శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు చేస్తున్నట్లు చెప్పారు. నిజమే.. నిజాన్ని దాచి పెట్టేసి.. వివరాలు వెల్లడించకుండా ఉండి ఉంటే.. ఈపాటికి ప్రపంచ దేశాల పరిస్థితి మరోలా ఉండేది కదా? ఈ లెక్కన చూసినప్పుడు నిజాల్ని వెల్లడిస్తూ.. పరిశోధన విషయంలో పారదర్శకంగా వ్యవహరించే వారి విషయంలో నిజాయితీగా ఉన్న వారికి మరింత అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Tags:    

Similar News