వరుసగా గెలవడంలో ఈ పార్టీలదే రికార్డు!

Update: 2022-12-09 04:52 GMT
ఏదైనా పార్టీ అధికారంలోకి రావడమే కష్టం. సరే వచ్చిందనుకున్నా ఐదేళ్ల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వాన్ని నడిపించడం ఇంకా కష్టం. ఏమాత్రం ప్రజలకు నచ్చకపోయినా ఎన్నికలు ఎప్పుడొస్తాయా? ఆ పార్టీని అధికారంలో నుంచి దింపేద్దామా అని ప్రజలు ఎదురుచూస్తుంటారు. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకతను తమ వైపు తిప్పుకుని గెలుపొందడానికి ప్రతిపక్ష పార్టీలు చూస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీ అయినా వరుసగా అధికారంలోకి రావడం చాలా కష్టం.

అయితే దేశంలో వివిధ రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు వరుసగా విజయాలు సాధిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతను, ప్రతిపక్షాల నిరసనలు, పోరాటాలను జయించి విజయం సాధిస్తున్నాయి. అలాంటి పార్టీలపై ఒక లుక్కేద్దాం..

గుజరాత్‌లో బీజేపీ ఏడోసారి..ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఇలాకా అయిన గుజరాత్‌ లో మరోమారు బీజేపీ విజయ దుందుభి మోగించింది. వరుసగా ఏడోసారి అధికారాన్ని దక్కించుకుని పశ్చిమ బెంగాల్‌ లో కమ్యూనిస్టులు నెలకొల్పిన రికార్డును సమం చేసింది. గుజరాత్‌ లో తొలిసారి 1995లో అధికారంలోకి వచ్చిన బీజేపీ అప్పటి నుంచి వరుసగా 27 ఏళ్ల పాటు అధికారంలో ఉంది.

మళ్లీ తాజాగానూ అధికారంలోకి వచ్చింది. అంతేకాకుండా ప్రభుత్వ వ్యతిరేకతను, కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీలను ఎదుర్కొని ఇప్పటివరకు గుజరాత్‌ లో ఏ పార్టీ సాధించలేనన్ని సీట్లను గెలుచుకుని సంచలనం సృష్టించింది. మొత్తం 182 స్థానాలు ఉన్న గుజరాత్‌లో ఏకంగా 156 స్థానాలతో రికార్డులు బ్రేక్‌ చేసింది.

పశ్చిమ బెంగాల్‌లో నాడు కమ్యూనిస్టులు– నేడు మమత విలక్షణ రాజకీయాలకు పెట్టింది పేరైన పశ్చిమ బెంగాల్‌లో 1977లో అధికారం చేపట్టిన కమ్యూనిస్టులు ఏకధాటిగా 34 ఏళ్లపాటు పరిపాలించారు. ఈ 34 ఏళ్లు ఇద్దరు ముఖ్యమంత్రులు మాత్రమే పనిచేయడం మరో విశేషం. కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చిన 1977లో జ్యోతిబసు ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. అప్పటి నుంచి ఆయన వరుసగా 23 ఏళ్లపాటు సీఎంగా ఉన్నారు. 2000 వరకు జ్యోతిబసు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత ఆయన తప్పుకున్నారు. జ్యోతిబసు తర్వాత కమ్యూనిస్టు పార్టీకే చెందిన బుద్ధదేవ్‌ భట్టాచార్య.. మరో పదేళ్లు అంటే 2010 వరకు అధికారంలో ఉన్నారు. దేశంలో అత్యధిక కాలం ఒక రాష్ట్రంలో వరుసగా అధికారంలో ఉన్న ఏకైక పార్టీగా కమ్యూనిస్టు పార్టీ చరిత్ర సృష్టించింది.

ఇక ఆ తర్వాత కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి తృణమూల్‌ కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన మమతా బెనర్జీ కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టారు. 2011లో తొలిసారి ముఖ్యమంత్రిగా విజయం సాధించారు. ఆ తర్వాత 2016, 2021 ఎన్నికల్లోనూ గట్టి పోటీని ఎదుర్కొని ఘనవిజయం దక్కించుకున్నారు.  

సిక్కింలో చామ్లింగ్‌ దేశంలో అతి చిన్న రాష్ట్రాల్లో ఒకటి.. సిక్కిం. ఇక్కడ 32 అసెంబ్లీ సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాలించిన పార్టీగా  సిక్కిం డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ రికార్డు సృష్టించింది. 1994లో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌.. వరుసగా ఐదుసార్లు విజయం సాధించడం విశేషం. ఆయన వరుసగా 24 ఏళ్ల పాటు సిక్కింను పరిపాలించారు. 23 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న జ్యోతిబసు రికార్డును పవన్‌ అధిగమించారు. తద్వరా దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌ దక్కించుకున్నారు. కాగా 2019 ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారీ పార్టీ విజయం సాధించడంతో పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌ సీఎం పీఠానికి దూరమయ్యారు.

ఒడిశా.. 22 ఏళ్లుగా నవీనే సీఎం ఇక ఒడిశా అవినీతి రహిత, పారదర్శక పాలనకు పెట్టింది పేరుగా నిలుస్తోంది. ఇక్కడ బిజూ జనతాదళ్‌ (బీజేడీ) అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌ వరుసగా విజయాలు సాధిస్తూ రికార్డు సృష్టిస్తున్నారు. 2000 నుంచి మొదలు పెట్టి ఇప్పటివరకు ఆయన వరుసగా ఐదుసార్లు ఆయన పార్టీ విజయం సాధించింది. 2000 నుంచి ఒడిశాకు ముఖ్యమంత్రిగా నవీన్‌ పట్నాయక్‌ ఉన్నారు. అంటే 22 ఏళ్లుగా ఒడిశా ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతున్నారు. త్వరలోనే ఆయన అత్యధిక కాలం ముఖ్యమంత్రులుగా ఉన్న పవన్‌ కుమార్‌ చామ్లింగ్, జ్యోతిబసుల రికార్డులను బద్దలు కొట్టబోతున్నారు. ఎందుకంటే ఇంకా ఆయన పదవీ కాలం రెండేళ్లకు పైగా ఉంది.

కమ్యూనిస్టుల కంచుకోట.. త్రిపుర ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన త్రిపురలోనూ 1993 నుంచి సీపీఎం వరుసగా అధికారంలో ఉంది. ఏకధాటిగా 23 ఏళ్లు అధికారంలో కొనసాగింది. ఈ 23 ఏళ్లలో 1998 నుంచి 2018 వరకు జరిగిన నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో మాణిక్‌ సర్కార్‌ విజయం సాధించారు. ఆయన మొత్తంగా 20 ఏళ్లు సీఎం పదవిలో ఉండటం విశేషం. 2018 ఎన్నికల్లో త్రిపుర సీఎం పీఠాన్ని బీజేపీ దక్కించుకుంది. 2022లోనూ రెండోసారి ఆ పార్టీ మరోమారు వరుసగా విజయాన్ని కొల్లగొట్టింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News