పంజాబ్ పీఠాన్ని నిర్ణ‌యించేది వాళ్లే!

Update: 2022-01-29 08:32 GMT
దేశ రాజ‌కీయాల‌ను మ‌లుపు తిప్పే అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతోంది. దీంతో ప్ర‌ధాన పార్టీల‌న్నీ ఆయా రాష్ట్రాల్లో విజ‌యం కోసం ప్ర‌ణాళిక‌ల్లో త‌ల‌మున‌క‌ల‌య్యాయి. వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే వ్యూహాల్లో మునిగిపోయాయి. ఈ నేప‌థ్యంలో పంజాబ్ ఎన్నిక‌లు ప్ర‌త్యేక దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. అక్క‌డ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌త క‌ల‌హాలు.. ప‌ట్టు కోసం బీజేపీ ప్ర‌య‌త్నాలు.. స‌త్తాచాటేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అడుగులు.. ఇలా అక్క‌డి రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. పంజాబ్ పీఠాన్ని ద‌క్కించుకోవాలంటే అక్క‌డి ద‌ళితుల ఓట్లు ఎంతో ముఖ్య‌మైన‌వి. అందుకే పార్టీల‌న్నీ ఆ వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే ప్రయ‌త్నాల్లో ప‌డ్డాయి.

మూడో వంతు..

నిజానికి ముందుగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం ఫిబ్ర‌వ‌రి 14న పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సింది. కానీ ఫిబ్ర‌వ‌రి 16న వార‌ణాసిలో నిర్వ‌హించే గురు ర‌విదాస్ జ‌యంత్యుత్స‌వాల్లో పాల్గొనేందుకు ద‌ళితులు అధిక సంఖ్య‌లో వెళ్తుంటారు. అందుకే వాళ్ల ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డం కోసం పోలింగ్ వాయిదా వేయాల‌ని పార్టీలన్నీ క‌లిసి ఎన్నిక‌ల సంఘాన్ని కోరాయి. దీంతో ఫిబ్ర‌వ‌రి 20కి ఎన్నిక‌లు వాయిదా ప‌డ్డాయి. ఈ ఎన్నిక‌ల వాయిదా విష‌యాన్ని గ‌మ‌నిస్తేనే అర్థ‌మవుతోంది.. ఆ రాష్ట్రంలో ద‌ళితుల ఓట్ల‌కు ఎంత‌టి ప్రాధాన్య‌త ఉందో. అక్క‌డి జ‌నాభాలో దాదాపుగా మూడో వంతు ప్ర‌జ‌లు ఎస్సీలే. దేశంలో మ‌రే రాష్ట్రంలోనూ వారి వాటా ఇంత ఎక్కువ‌గా లేదు.

పార్టీల క‌న్ను..

రాష్ట్రంలో ఉన్న మొత్తం 117కి అసెంబ్లీ స్థానాల‌కు గాను 64 చోట్ల అభ్య‌ర్థుల గెలుపోట‌ముల‌ను ద‌ళితులు ప్ర‌భావితం చేయ‌గ‌ల‌రు. అందుకే ఈ వ‌ర్గం ప్ర‌జ‌ల‌పై అన్ని పార్టీలు క‌న్నేశాయి. ఇటీవ‌ల పంజాబ్‌లో ముఖ్య‌మంత్రి పీఠంపై కాంగ్రెస్ చ‌ర‌ణ్‌జిత్ సింగ్ చ‌న్నీని కూర్చోబెట్ట‌డం అందులో భాగ‌మేన‌ని విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్ర చ‌రిత్ర‌లో తొలిసారి ఓ ద‌ళిత నేత‌ను ముఖ్య‌మంత్రి చేయ‌డంతో ఆ వ‌ర్గం ఓట్ల‌ను త‌మ‌కే ప‌డ‌తాయ‌నే న‌మ్మ‌కంతో కాంగ్రెస్ ఉంది. మ‌రోవైపు రైతు చ‌ట్టాల‌పై పోరాటానికి మ‌ద్ద‌తుగా బీజేపీతో బంధాన్ని తెంచుకున్న శిరోమ‌ణి అకాలీద‌ళ్‌.. ఇప్పుడు ఎన్నిక‌ల కోసం బహుజ‌న్ స‌మాజ్ పార్టీ (బీఎస్పీ)తో పొత్తు పెట్టుకుంది.

 తాము అధికారంలోకి వ‌స్తే ఎస్సీ ఎమ్మెల్యేను ఉప ముఖ్య‌మంత్రి చేస్తామ‌ని ఈ కూట‌మి ప్ర‌క‌టించింది. మ‌రోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ద‌ళితుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఎస్సీల పిల్ల‌ల‌కు ఉచితంగా విద్య అందిస్తామ‌ని, వాళ్ల‌కు పోటీ ప‌రీక్ష‌ల కోచింగ్ ఫీజు భ‌రిస్తామ‌ని ఆ పార్టీ హామీనిచ్చింది.
Tags:    

Similar News