ఏపీ స‌ర్కారును భ‌యపెడ్తున్న విష‌యాలివే !

Update: 2022-07-25 13:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని  రెండు విష‌యాలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి. వీటిపై ఎటు తేల్చుకోవాలో తేల్చుకోలేని స్థితిలో ప్రభుత్వ వర్గాలు సతమతం అవుతున్నాయి. సాధార‌ణంగా కనిపించే విష‌యాలే అనిపించినా... ప్రభావం మాత్రం పెద్దగా ఉంటోంది. వాటిలో ఒకటి పోలవరం ముంపు గ్రామాల సమస్య కాగా, మరోటి పాఠ‌శాల‌ల విలీనం. వీటిలో పాఠశాల విలీనం అయితే....  చాలా పెద్ద స‌మ‌స్య‌గానే మార‌బోతోంది.

జ‌గ‌న్ కు చెందిన సొంత మ‌నుషులే అస్స‌లు ఒప్పుకోవ‌డం లేదు. ఇదొక తప్పు  నిర్ణ‌యం అని  బాహాటంగానే అనేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య నారాయ‌ణ స్టేట్మెంట్స్ పై నిప్పులు చిమ్ముతున్నారు. ఇది ఒక‌వైపు ఉండగా మ‌రోవైపు తెర‌పైకి పోల‌వ‌రం ప్రాజెక్టు ముంపు గ్రామాల స‌మ‌స్య ఒక‌టి వేధిస్తూ వ‌స్తోంది. ఇప్పుడు అక్క‌డ ఏట‌పాక‌తో స‌హా నాలుగు ఊళ్లు త‌మ‌ను తెలంగాణ‌లో క‌లిపేయాల‌ని వేడుకుంటూ, నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తూ, పోలీసుల‌తో లాఠీ దెబ్బ‌లు తింటూ క‌న్నీటి ప‌ర్యంతం అవుతూ ఉన్నారు.

మొద‌ట‌గా పాఠ‌శాల‌ల విలీనానికి సంబంధించే మాట్లాడుకుంటే గ‌తం క‌న్నా భిన్నంగా ఒక‌టి రెండు త‌ర‌గ‌తుల‌ను అంగ‌న్ వాడీల‌కు వ‌దిలేసి, మూడు, నాలుగు, ఐదు త‌ర‌గ‌తుల‌ను హైస్కూల్స్ లో చేర్చ‌డంపై ప్ర‌కాశం జిల్లా జెడ్పీ స‌ర్వ స‌భ్య స‌మావేశంలో నిన్న‌టి వేళ నిర‌స‌న‌లు రేగాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలే అక్క‌డి డీఈఓను నిల‌దీసి, ఎందుకిదంతా అంటూ ఫైర్ అయ్యారు.

అదేవిధంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఎమ్మెల్యే మానుగుంట మ‌హీధ‌ర్ రెడ్డి త‌మ అసంతృప్తిని వ్య‌క్తం చేస్తూ పాఠ‌శాల‌ల విలీనాన్నీ త‌ప్పు ప‌డుతూ అధికారులు ఎక్క‌డో కూర్చొని నిర్ణ‌యాలు తీసుకుని ఉంటార‌ని చుర‌క‌లు అంటించారు. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యాల కార‌ణంగా మ‌ళ్లీ డ్రాపౌట్స్ పెరిగే అవ‌కాశాలు ఉంటాయ‌ని, చిన్న పిల్ల‌లు రోడ్లు  దాటి ఎలా బ‌డుల‌కు వెళ్ల‌గ‌ల‌ర‌ని, అప్ప‌టిదాకా స్థానికంగా ఉన్న బ‌డుల‌ను ఏ మాత్రం చెప్పాపెట్ట‌కుండా ఎలా మూసివేస్తార‌ని ప‌లువురు అధికార పార్టీ స‌భ్యులు ప్ర‌శ్నించారు అని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే మ‌రోవైపు విభ‌జ‌న తీరు ఒక‌టి ఆగ్ర‌హాల‌కు గురిచేస్తోంది. పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి ముంపు గ్రామాల‌ను  ఎనిమిదేళ్ల కింద‌ట మ‌న ఆంధ్రాలో విలీనం చేస్తూ ప్రెసిడెంట్ ఆర్డర్ ఇచ్చారు. కానీ ఇప్పుడు అక్క‌డ భిన్న ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. పున‌రావాసం బాధితుల‌కు క‌ల్పించ‌కుండా, వారికి నిలువ నీడ ద‌క్క‌నీయ‌కుండా, పరిహారానికి సంబంధించి ప్యాకేజీని ఖ‌రారు చేయ‌క , చెల్లించ‌క ఏపీ స‌ర్కారు చోద్యం చూస్తోంద‌ని ఇక్క‌డి ముంపు గ్రామాల ప్ర‌జ‌లు మండిప‌డుతూ రోడ్డెక్కుతున్నారు. వీరికి తెలంగాణ నాయ‌కులు సైతం మ‌ద్దతుగానే ఉన్నారు.

త‌మ‌ను తెలంగాణ‌లో క‌లిపేయ్యాల‌ని వేడుకుంటున్నారు. వీటిపై స్ప‌ష్ట‌త ఇచ్చేవర‌కూ పోరుబాట వీడ‌బోమ‌ని అంటున్నారు. ఈ విధంగా విలీనం ఓ వైపు విభ‌జ‌న మ‌రో వైపు బాధితుల ఆగ్ర‌హావేశాలకు కార‌ణం అవుతున్నాయి. వీటిపై స్ప‌ష్టం అయిన ప్ర‌క‌ట‌న చేసే విధంగా చొర‌వ అయితే సీఎం  చూప‌లేక‌పోతే, ఏమీ తేల్చకుండా ఉండిపోతే భ‌విష్య‌త్ లో మ‌రిన్ని నిర‌స‌న‌లు ఉద్ధృతం అయ్యే అవ‌కాశాలే మెండు అని క్షేత్ర స్థాయిలో ఉంటూ సంబంధిత నిర‌స‌న‌ల‌కు నాయ‌క‌త్వ బాధ్య‌త తీసుకున్న వారంతా ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రిస్తున్నారు.
Tags:    

Similar News