ఇదో కొత్త సైబర్ నేరం.. సినిమా రివ్యూకు డబ్బులంటూ కోటి కొట్టేశాడు

Update: 2023-04-04 11:28 GMT
ఆన్ లైన్ లో మోసగాళ్లు పెరిగిపోతున్నారు. కాదేది మోసానికి అనర్హం అన్నట్టుగా మారింది. అమాయకులు అత్యాశతో సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుకుపోతున్నారు.  నిన్న యూట్యూబ్ లైక్ ల పేరిట భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. తాజాగా గుజరాత్ కు చెందిన ఓ జంటను సినిమా రివ్యూల పేరుతో మోసం చేసి కోటి వరకూ నగదు కాజేశారు.

గుజరాత్ లోని జామ్ నగర్ కు చెందిన ఓ జంటకు టెలిగ్రామ్ యాప్ లో వర్క్ ఫ్రం హోం పేరుతో ఓ ప్రకటన వచ్చింది. ఇంట్లోనే ఉండి సినిమాలు చూసి వాటికి రివ్యూ, రేటింగ్ ఇవ్వడం ద్వారా నగదు సంపాదించవచ్చనేది వీరు ఇచ్చిన ఉద్యోగ ఆఫర్. ఇందుకు ప్రతి సినిమాకు రూ.2500 నుంచి రూ.5000 వరకూ చెల్లిస్తామని అందులో పేర్కొన్నారు.  ఈ అవకాశం గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనే ఉద్దేశంతో సదురు జంట మెసేజ్ పంపిన వ్యక్తికి ఫోన్ చేయగా.. ముందుగా ఓ వెబ్ సైట్ లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. అయితే ఆ వెబ్ సైట్ నకిలీది అని గుర్తించలేకపోయిన ఆ జంట తమ వివరాలను నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత సైబర్ నేరగాళ్లు టెలిగ్రామ్ గ్రూప్ లో సభ్యులుగా చేర్చారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తైన తర్వాత సినిమాలు చూడమని సూచించారు.

సినిమా చూసేందుకు రిజిస్ట్రేషన్ చేసిన వెబ్ సైట్ నుంచి టికెట్లు కొనాలని .. తర్వాత వెబ్ సైట్ లో రేటింగ్ ఇవ్వాలని సూచించారు. అలా సుమారు 28 సినిమాలకు రేటింగ్, రివ్యూ ఇచ్చారు. వారిని నమ్మించేందుకు సైబర్ నేరగాడు కొంత మొత్తం నగదును వారి ఖాతాలో జమ చేశాడు. తమ ఖాతాలో డిపాజిట్ అయిన మొత్తాన్ని అప్పుడే విత్ డ్రా చేసుకోవద్దని.. ఆ మొత్తంతో మరిన్ని టికెట్లు కొని సినిమాలు చూసి రేటింగ్ ఇవ్వాలని కోరాడు. అలా వారి ఖాతాలో తొలి విడత రూ.10వేలు,. రెండోసారి రూ.99 వేలు , మరో సారి రూ.5 లక్షలు నగదు డిపాజిట్ చేసి తిరిగి ఆ మొత్తాన్ని టికెట్లు కొనేలా చేశాడు.

అలా వారి చేత 40 లక్షల విలువైన టికెట్లు కొనుగోలు చేయించి వారి ఖాతాలో రూ.70 లక్షలు నగదు జమ చేశారు. ఈ నగదు విత్ డ్రా చేస్తే మనీలాండరింగ్ కేసు అవుతుందని చెప్పి ఆ మొత్తాన్ని మరో ఖాతాలో పెట్టుబడిగా పెట్టాలని నమ్మించాడు. అతడి మాటలను నమ్మిన జంట విడతల వారీగా రూ.1.12 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఈ మొత్తం నగదు బదిలీ అయ్యాక అవతలి వ్యక్తి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. మోసపోయామని గ్రహించిన జంట పోలీసులకు ఫిర్యాదు చేసి లబోదిమన్నది. ఈ కేసులో బాధితులు ఉన్నత విద్యావంతులు కావడం విశేషం. అంత మొత్తం పడ్డా విత్ డ్రా చేసుకోకుండా నిండా మునిగిన జంట తీరు చూసి అవగాహన రాహిత్యం అని పోలీసులు హితబోధ చేసినట్టు తెలిసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News