ఏపీలో మ‌రో పీకే ర‌చ్చ‌.. బ్యాంకుల వ‌ద్ద క్యూలు

Update: 2019-04-19 09:15 GMT
పీకే.. ఏంది?  కొత్త‌గా రావ‌టం ఏమిటంటారా?  ఏపీకి.. పీకే అనే రెండు అక్ష‌రాల‌కు ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. పీకే అంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్న‌ది మామూలే. జ‌గ‌న్ కార‌ణంగా ప్ర‌శాంత్ కిశోర్ అనే ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త పేరు పాపుల‌ర్ అయ్యింది. ఇక‌.. ఇప్పుడు చెప్పే మూడో పీకే.. బాబు పుణ్యంగా చెప్పాలి. ఏపీ ఎన్నిక‌ల్లో ప్ర‌భావాన్ని చూప‌ట‌మే కాదు.. ఈ పీకేతోనే త‌మ‌కు అధికారం మ‌ళ్లీ ద‌క్కుతుంద‌ని భావిస్తున్నారు తెలుగు త‌మ్ముళ్లు.
ఇంత‌కీ.. ఈ పీకే మ‌రేమిటో కాదు.. బాబు ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ పెట్టిన ప‌సుపుకుంక‌మ ప‌థ‌కం. ఈ ప‌థ‌కంలో కింద ఎన్నిక‌ల వేళ బ్యాంకుల్లో డ‌బ్బులు వేయ‌టం తెలిసిందే. ఏమైందో.. ఎవ‌రు షురూ చేశారో కానీ.. బ్యాంకుల్లో జ‌మ అయిన న‌గ‌దును ఈ నెల 20 లోపు తీసుకోక‌పోతే.. వెన‌క్కి వెళ్లిపోతాయ‌న్న పుకారు మొద‌లైంది.దీంతో.. ఒక్క‌సారిగా జ‌నం బ్యాంకుల‌కు పోటెత్తుతున్నారు.

ఏపీలోని విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఈ పుకారు షికారు చేస్తోంది. దీంతో.. జిల్లాలోని గిరిజ‌న ప్రాంతాల్లోని ల‌బ్థిదారులు బ్యాంకుల వ‌ద్ద‌కు పోటెత్తుతున్నారు. దీంతో భారీ క్యూ లైన్లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఒక్క‌సారిగా ఇంత‌మంది బ్యాంకుల‌కు వ‌స్తే.. ఎవ‌రు మాత్రం ఏం చేయ‌గ‌ల‌రు?  బ్యాంక్ సిబ్బంది తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్నారు. పోలీసుల్ని ర‌ప్పించి.. వారి సాయంతోక్యూలైన్ల‌ను ఏర్పాటు చేస్తున్నారు.

ఒక్క‌సారిగా ఇంత‌మంది బ్యాంకుల వ‌ద్ద‌కు వ‌స్తే.. డ‌బ్బులు ఇవ్వ‌టం క‌ష్ట‌మ‌న్న మాట బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. అదే స‌మ‌యంలో.. ఇది ఉత్త పుకారే త‌ప్పించి.. ఇంకేం కాదని స్ప‌ష్టం చేస్తున్నారు. ఒక‌సారి బ్యాంకు అకౌంట్లోకి వ‌చ్చిన డ‌బ్బులు వెన‌క్కి వెళ్లే అవ‌కాశం ఉంద‌ని వారు స్ప‌ష్టం చేస్తున్నారు. పుకార్ల‌ను న‌మ్మొద్ద‌ని.. అన‌వ‌స‌ర‌మైన ఆందోళ‌న‌కు గురి కావొద్ద‌ని చెబుతున్నారు. ఈ పుకారు మ‌రింత పెరిగి.. మిగిలిన జిల్లాల‌కు భారీగా వ్యాపిస్తే. బ్యాంకుల‌కు కొత్త క‌ష్టాలు ఖాయ‌మంటున్నారు. ఇంత‌కీ.. ఈ పుకారు ఎలా మొద‌లైంది? ఎవ‌రు షురూ చేసి ఉంటార‌న్న దానిపై పోలీసులు దృష్టి పెడితే మంచిదేమో?

Tags:    

Similar News