కూల్చివేత‌పై త‌మ్ముళ్లు తీరు బాగోలేద‌న్న త్రిమూర్తులు

Update: 2019-06-27 07:16 GMT
గ‌డిచిన మూడు రోజులుగా ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌జావేదిక కూల్చివేత అంశం హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. క‌లెక్ట‌ర్ల స‌మావేశంలో ఏపీ ముఖ్య‌మంత్ర వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ప్ర‌భుత్వ‌మే భ‌వ‌నాన్ని నిర్మించ‌టం రాంగ్ సిగ్న‌ల్స్ పోతుంద‌ని.. ప్ర‌భుత్వ‌మే త‌ప్పు చేయ‌కూడ‌ద‌ని.. అందుకే తాను ఈ మందిరంలో స‌మావేశం ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పి.. బుధ‌వారం ఈ నిర్మాణాన్ని కూల్చివేయాలంటూ ఆదేశాలు జారీ చేయ‌టం తెలిసిందే.

దీనిపై టీడీపీ నేత‌లు తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నారు. ఈ స‌మావేశ మందిరాన్ని త‌మ‌కు ఇవ్వాల‌ని విప‌క్ష నేత చంద్ర‌బాబు కోరినందుకే జ‌గ‌న్ దాన్ని కూల్చివేస్తున్నారన్న ఆరోప‌ణ‌ల‌తో పాటు.. ప‌లు విమ‌ర్శ‌లు చేశారు. ఇదిలా ఉంటే టీడీపీ నేత‌ల తీరుకు భిన్న‌మైన వాద‌న‌ను వినిపిస్తున్నారు టీడీపీ సీనియ‌ర్ నేత తోట త్రిమూర్తులు. ప్ర‌జావేదిక కూల్చివేత మీద తెలుగుదేశం పార్టీ నేత‌లు స్పందిస్తున్న తీరు ఏ మాత్రం స‌రిగా లేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

అన‌వ‌స‌ర రార్దాంతం చేసేలా ఉండ‌కూడ‌ద‌ని.. ప్ర‌జావేదిక కూల్చివేత‌లో ప్ర‌జా ప్ర‌యోజ‌నాలు ఏమీ లేవ‌ని.. అలాంట‌ప్పుడు ఈ అంశానికి అధిక ప్రాధాన్య‌త ఇవ్వ‌టం త‌ప్ప‌ని చెప్పారు.

టీడీపీ నేత‌ల మాట‌లు అధినేత మ‌న‌సును మెప్పించేందుక‌న్న‌ట్లుగా ఉండ‌కూడ‌ద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అధిష్ఠానం మెప్పు కోసం చేయ‌టం స‌రికాద‌ని.. అలాంటి తీరును మార్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. త‌మ పార్టీ నేత బుద్ధా వెంక‌న్న మాదిరి మాట్లాడ‌టం స‌రికాద‌న్నారు. ఇలాంటి వ్యాఖ్య‌లు ప్ర‌జ‌ల్లోకి త‌ప్పుడు సంకేతాలు వెళ్లేలా చేస్తాయ‌న్నారు.

ప్రజావేదిక వ్య‌క్తిగ‌త‌ స్వార్థం కోసం నిర్మించ‌లేద‌ని.. తాత్కాలిక అవ‌స‌రం కోసం మాత్ర‌మే నిర్మించిన విష‌యాన్ని గుర్తు చేసుకోవాల‌న్నారు. ప్ర‌జావేదిక నిర్మాణాన్ని కూల్చివేయ‌టంపై ప్ర‌జ‌లు ఎలాస్పందింస్తార‌న్న‌ది వారికే విడిచిపెట్టాల‌ని.. ఈ విష‌యంపై మౌనంగా ఉండ‌టం మంచిద‌న్నారు. ప్ర‌జావేదిక ముఖ్య‌మంత్రిని వివిధ జిల్లాల నుంచి క‌ల‌వ‌టానికి వ‌చ్చిన వారిని క‌లిసేందుకు ఏర్పాటు చేసిన భ‌వ‌న‌మే త‌ప్పించి మ‌రింకేమీ కాద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌ద‌న్నారు.

తానుపార్టీ మారుతున్న‌ట్లుగా వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని.. అది ఉత్త ప్ర‌చార‌మేన‌ని తేల్చేశారు.తాను వైఎస్ జ‌గ‌న్ తో ఉన్న‌ట్లుగా ప్ర‌చారంలో ఉన్న ఫోటోపై వివ‌ర‌ణ ఇచ్చిన త్రిమూర్తులు.. పాద‌యాత్ర‌స‌మ‌యంలో తాను.. జ‌గ‌న్ విశాఖ లాంజ్ లో క‌లిశామ‌ని.. ఆ సంద‌ర్భంగా ఇద్ద‌రం ఒకే విమానంలో ప్ర‌యాణించామ‌ని.. ఆ సంద‌ర్బంగా తీసిన ఫోటోగా చెప్పారు. ప్ర‌జావేదిక కూల్చివేత‌తో పాటు.. క‌ర‌క‌ట్ట మీద ఉన్న మిగిలిన అక్ర‌మ క‌ట్టడాల్ని కూల్చివేస్తే జ‌గ‌న్ ప్ర‌భుత్వ చిత్త‌శుద్ధిని న‌మ్మొచ్చ‌న్నారు. మిగిలిన త‌మ్ముళ్ల‌కు కాస్త భిన్నంగా  స్పందించిన త్రిమూర్తుల మాట‌లు టీడీపీలో కొత్త సందేహాల‌కు తావిచ్చాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News