తోట త్రిమూర్తులుకు ఓకే చెప్పి వైఎస్ ఆర్సీపీ పొరపాటు చేసిందా?

Update: 2019-09-14 01:30 GMT
ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తిని - గెలిచిన పార్టీ చేర్చుకోవడం ఎంత వరకూ ఉపయోగపడుతుంది? అనేది బేసిక్ లాజిక్. ఈ విషయంలో ఎవరికి వారు ఒక ఒపీనియన్ కు రావొచ్చు. ఒకవేళ గెలిచిన వారు ఎవరైనా జగన్ షరతుల మేరకు పదవికి రాజీనామా చేసి వస్తే..అలాంటి వారి గట్స్ ను మెచ్చుకుని అయినా చేర్చుకోవచ్చు. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తిని చేర్చుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్తలు విడ్డూరంగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.

అలా ఓడిన వ్యక్తి మరెవరో కాదు.. తోట  త్రిమూర్తులు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఈయన చేరికకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్తలు ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ.. అన్నట్టుగా వ్యవహరించే ఇలాంటి వాళ్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేర్చుకుంటోందో.. అనే సందేహాలు కలుగుతూ ఉన్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.

తోట త్రిమూర్తులు ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి ఊగిసలాడారు. చేరడమా.. వద్దా.. అనే అంశంపై ఆయన తర్జనభర్జనలు పడి.. చివరకు తెలుగుదేశం పార్టీలోనే ఉండిపోయారని  స్పష్టమైంది. ఇక ఈయన తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడం - ఓడిపోవడం రెండూ జరిగాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ కొట్టాలని చూస్తూ ఉన్నారు.

అయితే ఈయన వల్ల పార్టీకి ఏం ఉపయోగం? అంటూ ఆ ప్రాంత నేతలు ప్రశ్నిస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈయన ఒక ఔట్ డేటెడ్ పొలిటీషియన్ అని -ఎక్కడ అధికారం ఉంటే అక్కడకు చేరే  ఈయన తీరుపై జనాలు కూడా విరక్తితో ఉన్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి కూడా ఈయన వల్ల పెద్దగా ఉపయోగం లేకపోయిందని, అలాంటిది ఓడిపోయాకా ఈయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంత వరకూ ఉపయోగపడతారనేది ప్రశ్నగానే ఉంది.

ఇక కాపు నేతలు కూడా ఈ విషయంలో విముఖతతోనే కనిపిస్తున్నారట. ఆయన వల్ల ఉపయోగం లేదని వారు అంటున్నట్టుగా సమాచారం. ఇక జగన్ వెంట మొదటి నుంచి ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ తో తోట త్రిమూర్తులుకు విబేధాలున్నాయి కూడా. ఇలాంటి నేపథ్యంలో ఈయన చేరిక పట్ల మరింత వ్యతిరేకత వ్యక్తం కావొచ్చు. టీడీపీ ని ఓడిపోయిన దగ్గర నుంచి బ్లాక్ మెయిల్ చేస్తూ ఇప్పుడు ఈయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నాడనే ప్రచారం కూడా సాగుతూ ఉంది. కేవలం చంద్రబాబు పార్టీ నుంచి నేతను తెచ్చారనే ప్రచారానికే తప్ప ఈయన ఉపయోగం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉండకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 
Tags:    

Similar News