హుజూరాబాద్ సిత్రం.. మీ ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయా? రూ.3లక్షలు ఖాయం

Update: 2021-10-19 07:30 GMT
ఒకప్పుడు ఉప ఎన్నికలు అంటే పెద్ద ఆసక్తి ఉండేది కాదు. ఏమైనా.. అధికారపక్షమే గెలిచే పరిస్థితి ఉండేది. అందుకు భిన్నంగా ఉప ఎన్నికను ఊపిరి బిగపెట్టేలా చేయటం.. తీవ్రమైన భావోద్వేగంతో జరిగేలా చేయటంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలకభూమిక పోషించారని చెప్పాలి. నిజం చెప్పాలంటే.. ఉప ఎన్నికలతోనే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమైందని చెప్పాలి. తెలంగాణ సెంటిమెంట్ కాస్త తగ్గుతుందన్న వెంటనే.. ఉప ఎన్నిక తెర మీదకు రావటం.. భావోద్వేగాన్ని రగల్చటం.. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమన్న విషయాన్ని అదే పనిగా చెప్పటం ద్వారా.. కొంతమేర మార్పు తీసుకురావటంలో కీలకభూమిక పోషించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఉప ఎన్నికల్ని తనకు అనుకులంగా మార్చుకోవటంలో కేసీఆర్ తెలివిని మెచ్చుకోకుండా ఉండలేం. ఉప ఎన్నికకు కారణం ఏదైనా.. దాన్ని పట్టించుకోకుండా కేవలం తమ పార్టీ బలపడేందుకు వీలుగా ఆయన పావులు కదిపేవారు. ఇందుకోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించారు. ఈ కారణంతోనే ఉప ఎన్నికలకు సంబంధించి ఒక్క దుబ్బాక మినహా మరే ఉప ఎన్నికల్లోనూ గులాబీ బాస్ కు ఎదురుదెబ్బ తగిలింది లేదు. వాస్తవానికి దుబ్బాకలో కూడా గులాబీ కారునే గెలవాలి. కానీ.. అక్కడ నెలకొన్న ప్రత్యేక పరిస్థితులతో పాటు.. టీఆర్ఎస్ అధినాయకత్వం మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించటం కూడా ఓటమికి కారణమైందని చెప్పాలి.

ఈ మధ్యన జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నిక విషయానికి వస్తే.. గతంలో జరిగిన తప్పులు జరగకుండా చూసుకోవటంతోపాటు.. ఏ విషయంలోనూ తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తన అస్త్రశస్త్రాల్ని.. తన బలగాల్ని పూర్తిస్థాయిలో మొహరించారు. దీంతో సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి లాంటి సీనియర్ దారుణ ఓటమి చవి చూడగా.. టీఆర్ఎస్ విజయం సాధించింది.

ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల విషయంలోనూ టీఆర్ఎస్ అదే వ్యూహాన్ని అమలు చేస్తోంది. దీంతో.. మిగిలిన పార్టీలు టీఆర్ఎస్ అధిక్యతను గండి కొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఓటర్లకు భారీ ఎత్తున తాయిలాలు అందించేందుకు ఎవరూ వెనుకాడటం లేదు. విశ్వసనీయ వర్గాలనుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. హుజూరాబాద్ లో ఒక్కో ఓటుకు రూ.10 నుంచి రూ.15 వేలు చొప్పున ఇస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

తాజాగా ఓట్లకోసం పోరు ఎక్కువైన నేపథ్యంలో పార్టీలు అనూహ్యమైన ఆఫర్ ను తెర మీదకు తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు. ఏదైనా కుటుంబంలో పది ఓట్లు ఉండి ఉంటే.. ఆ కుటుంబానికి నేరుగా రూ.3లక్షలు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. ఒకట్రెండు ఓట్లను బేరం ఆడేకన్నా.. హోల్ సేల్ గా ఓట్లు లభించే కుటుంబాలను టార్గెట్ చేస్తున్న పార్టీలు ఇప్పుడు కుటుంబానికి రూ.3లక్షలు ఇవ్వటానికైనా సిద్ధపడటం చూస్తే.. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఖర్చు ఎంత భారీగా మారుతుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.




Tags:    

Similar News