ఆ కుర్రాడ్ని అందుకే చంపేశారా?

Update: 2016-03-19 05:10 GMT
పదో తరగతి కుర్రాడు అభయ్ కిడ్నాప్.. హత్య చిక్కుముడులు దాదాపు వీడిపోయినట్లే. ప్లాస్టిక్ వ్యాపారి కుమారుడు అభయ్ ను కిడ్నాప్ చేసి రూ.10కోట్లు డిమాండ్ చేయటం.. అనంతరం రూ.5కోట్లకు మాట్లాడుకొని.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు రమ్మని చెప్పటం.. అక్కడ పెద్ద అట్టపెట్టెలో అతడ్ని చంపేసి కుక్కేసిన వైనం తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసు మిస్టరీని చేధించేందుకు ప్రయత్నించిన పోలీసులు.. పురోగతి సాధించారు.

అభయ్ ను కిడ్నాప్ చేసింది.. వారింటికి దగ్గర్లోనే పని చేసే చిన్నసాయిగా గుర్తించారు. సీసీ కెమేరాల ఫుటేజ్ ఆధారంగా అభయ్ ను బండి మీద తీసుకెళ్తున్న దృశ్యాలు లబించటం కేసుకు కీలకంగా మారింది. అయితే.. అభయ్ హత్య వెనుక హవాలా రాకెట్ కీలకభూమిక పోషించిందన్న మాట ఇప్పుడు తెరపైకి వచచింది. పైకి ప్లాస్టిక్ వ్యాపారం చేస్తున్నట్లు కనిపించే అభయ్ తండ్రి.. హవాలా వ్యాపారాన్ని నడిపిస్తుంటాడని.. దీనికి సంబంధించిన వైరం.. అభయ్ మరణానికి కారణంగా భావిస్తున్నారు.

అభయ్ కిడ్నాప్ లో కీలకమైన చిన్నసాయి రాజమండ్రి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు తేల్చారు. కిడ్నాప్ వ్యవహారంలో చిన్నసాయిని పావుగా వాడుకున్న కిడ్నాపర్లు.. అనంతరం అభయ్ ను చంపేసి ఉంటారన్న వాదన వినిపిస్తోంది. ఇదే ఉదంతానికి సంబంధించి మరో కోణం ఏమిటంటే.. అభయ్ కు వేసిన ప్లాస్టర్.. మూతితో పాటు.. ముక్కు మీద కూడా బలంగా అంటించివేయటంతో.. ఊపిరి ఆడక మరణించి ఉంటాడన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకోవైపు.. అభయ్ ను కావాలనే చంపేసి ఉంటారని.. వ్యాపార లావాదేవాల్లో ఉన్న విభేదాలతో ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇక.. అభయ్ హత్యలో కీలకమైన వ్యక్తిగా చిన్నసాయిని వైజాగ్ లో అదుపులోకి తీసుకోగా.. మిగిలిన ఇద్దరు నిందితుల్ని విజయవాడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరిని శనివారానికి హైదరాబాద్ కు తీసుకురానున్నారు. టిఫిన్ కోసం బయటకు వెళ్లిన అభయ్ ను స్కూటీ మీద తీసుకెళ్లింది చిన్న సాయి అని పోలీసులు తేల్చారు. అభయ్ తో పరిచయం ఉండటం.. అతనితో కలిసి క్రికెట్ ఆడటం లాంటివి చేసేవాడని.. అలాంటోడు కిడ్నాప్ చేసి చంపేయటం పలువురికి షాకింగ్ గా మారింది. తెలిసిన వారిని.. పరిచయస్తుల్ని సైతం ఉత్తినే నమ్మకూడదన్న వైనం తాజా ఉదంతంతో స్పష్టమవుతుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News