ప్ర‌కాశం జిల్లాలో దారుణం... క‌రెంట్ షాక్‌ తో ముగ్గురు విద్యార్థులు మృతి

Update: 2019-08-14 06:25 GMT
ప్ర‌కాశం జిల్లాలో బుధ‌వారం ఉద‌యం దారుణం జ‌రిగింది. ఆట‌లు ఆడుకుంటోన్న ముగ్గురు విద్యార్థులు క‌రెంట్ షాక్‌ తో అప్ప‌టిక‌ప్పుడే మృతిచెందారు. జిల్లాలోని సంతమాగులూరు మండలం కొప్పరం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ సంఘ‌ట‌న‌లో ముగ్గురు విద్యార్థులు మృతి చెంద‌గా... మరో ఇద్దరు గాయపడ్డారు. గ్రామంలోని జెండా స్తంభాన్ని పట్టుకుని ఆడుకుంటున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.

వీరు ఆడుకుంటున్న టైంలో జెండా స్తంభం ఓ వైపు ఒరిగింది. అదే టైంలో ప‌క్క‌నే ఉన్న విద్యుత్ లైన్ తగలడంతో ఆ స్తంబానికి షాక్ వచ్చింది. దీంతో ఆ స్తంభాన్ని ప‌ట్టుకున్న విద్యార్థులు తీవ్ర‌మైన విద్యుత్ ఘాతానికి గుర‌య్యారు. రేపటి స్వాతంత్ర దినోత్సవ వేడుక‌ల్లో అందరు విద్యార్థుల్లాగా సంతోషంగా జెండావందనం చేయాల్సిన ముగ్గురు విద్యార్థులు ఈ లోకాన్ని విడిచి వెళ్ల‌డంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతులు షేక్ పఠాన్ గౌస్ (11)- షేక్ హసన్ బుడే (11)- పఠాన్ అమర్ (11)గా గుర్తించారు.  

పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. వీరు ముగ్గురు ఐదో త‌ర‌గ‌తి చ‌దువుతున్నారు. ఏపీలో ప్ర‌స్తుతం వ‌ర్షాలు గ‌ట్టిగా ప‌డుతున్నాయి. ఈ టైంలో ఎర్త్ స‌మ‌స్య‌లు ఎక్కువుగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఇనుప పోల్స్‌ కు విద్యుత్ తీగ‌లు త‌గ‌ల‌డంతో వాటికి కూడా విద్యుత్ వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే త‌మ‌కు తెలియ‌కుండానే ఆ పోల్స్ ప‌ట్టుకుంటోన్న వారు క‌రెంట్ షాక్‌ తో గాయాల పాల‌వ్వ‌డ‌మో లేదా మృతి చెంద‌డ‌మో జ‌రుగుతోంది.

    
    

Tags:    

Similar News