టిక్ టాక్ స్టార్.. మాజీ భర్త చేతిలో హతం

Update: 2022-08-10 04:42 GMT
వ్యక్తిగత జీవితం అన్నది లేకుండా చేయటంలో సోషల్ మీడియా ప్లే చేస్తున్న రోల్ అంతా ఇంతా కాదు. సున్నితమైన విషయాల్ని ముక్కు ముఖం తెలీని వారికి చెప్పటేమ కాదు.. ప్రపంచం మొత్తం టాంటాం వేసుకునే విచిత్రమైన పరిస్థితి సోషల్ మీడియా జమానాలో నెలకొంది. ఎవరేం అనుకుంటారన్న విషయాల్ని వదిలేసి.. తమకు నచ్చిన విషయాల్ని ఓపెన్ అయ్యేందుకు వెనుకాడని పరిస్థితి. ఇలాంటివి కొంతవరకు బాగానే ఉన్నా.. చాలా సందర్భాల్లో సమస్యల్ని తెచ్చి పెడతుంటాయి. అప్పుడప్పుడు ప్రాణాలు తీసే వరకు విషయాలు వెళుతుంటాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది.

పాకిస్తానీ అమెరికన్ మహిళ సానియా ఖాన్ తన వ్యక్తిగత జీవితాన్ని సోషల్ మీడియాలో పంచుకోవటం ద్వారా.. ఆమె తన భర్త చేతిలో అమానుషంగా హత్యకు గురైన షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది.

తన భర్తతో తన వైవాహిక జీవితం ఎందుకు ఫెయిల్ అయ్యిందన్న విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అంతేకాదు.. తన మాజీ భర్త గురించి.. అతడి కుటుంబం గురించి తనకు ఎదురైన చేదు అనుభవాలతో పాటు.. విడాకులు తీసుకున్న మహిళగా తనకు ఎదురైన ఇబ్బందుల్ని ఆమె ఎకరువు పెట్టింది. ఇవన్నీ కలిసి ఆమె ప్రాణాలు పోయేందుకు కారణమయ్యాయి.

సానియా ఖాన్ ఆమె మాజీ భర్త రహెల్ అహ్మద్ లు ఐదేళ్లు డేటింగ్ చేసుకున్న అనంతరం 2021లో వారిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. పెళ్లి తర్వాత వారిద్దరు చికాగోలో కాపురం పెట్టారు. తర్వాత వారిద్దరి మధ్య తలెత్తిన విభేదాల కారణంగా విడిపోయారు. ఆమెకు టిక్ టాక్.. ఇన్ స్ట్రాలో మంచి పేరుంది. తనకు బాధ కలిగినా.. ఆనందం కలిగినా సోషల్ మీడియా ద్వారా ఆమె అన్ని విషయాల్ని షేర్ చేసుకుంటారు. ఆమె చికాగో నుంచి టేనస్సీకి షిఫ్టు అయ్యే విషయాల్ని ఆమె వెల్లడించారు.

తన వ్యక్తిగత విషయాల్ని అందరికి చెప్పేస్తుందన్న ఫస్ట్రేషన్ కు గురైన ఆమె మాజీ భర్త.. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసుకున్న వ్యక్తిగత అంశాల్ని ఆధారంగా చేసుకొని ఆమె ఉన్న వద్దకు వచ్చి.. ఆమెను దారుణంగా చంపేశాడు. ఇందుకోసం అతగాడు వెయ్యి కిలోమీటర్ల ప్రయాణించి మరీ ఆమెను చంపేయటం షాకింగ్ గా మారింది.

ఆమెనుచంపేసిన అనంతరం అతను ఆత్మహత్య చేసుకున్నాడు. తమ కుమారుడు కనిపించటం లేదన్న విషయాన్ని అతడి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో.. ఈ దారుణం బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో సంగతులు షేర్ చేసుకోవాల్సిందే. కాకుంటే.. అదెంతవరకు? అన్న విచక్షణ చాలా చాలా అవసరమన్న విషయం తాజా ఉదంతాన్ని చూస్తే అర్థమవుతుందని చెప్పాలి.
Tags:    

Similar News