కొత్త నోట్ల కోసం ‘సినిమా’ టైం పడుతోంది

Update: 2016-11-10 06:19 GMT
పెద్దనోట్ల రద్దుపై ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయంతో దేశ ప్రజలంతా ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. ఒక రోజంతా చేతిలో డబ్బులు లేకపోతే ఎలా ఉంటుందన్నది ఎవరికి వారు స్వయంగా అనుభవంలోకి వచ్చిన పరిస్థితి. పాత పెద్ద నోట్లను బ్యాంకులకు ఇచ్చి కొత్తగా చిల్లర నోట్లనుకానీ.. రూ.2వేల నోట్లను తీసుకునే వెసులుబాటును ఈ రోజు కల్పించారు. దీంతో.. తమ దగ్గరున్న పెద్దనోట్లను బ్యాంకులకు ఇచ్చేసి.. కొత్త నోట్లు తీసుకునేందుకు ప్రజలు బ్యాంకుల వద్ద పోటెత్తారు.

ముందుగా నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి రూ.4వేలు మాత్రమే బ్యాంకులు ఈ రోజు ఇస్తున్నాయి. పాన్ కార్డు లేదంటే ఆధార్ కార్డుతో పాటు.. వ్యక్తిగత వివరాల్ని వెల్లడిస్తూ ఒక ఫారం మీద రాసిన తర్వాత బ్యాంకు సిబ్బందికి ఇస్తే.. వారు కోరుకున్నట్లుగా రూ.100 నోట్లు కానీ రూ.2వేల నోట్లను ఇస్తున్నారు. పెద్ద నోట్లను మార్పిడి చేసుకోవటానికి ఎంత సమయం పడుతుందన్న విషయాన్ని చూస్తే.. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా నగరాల్లో కానీ పట్టణాల్లో కానీ కనీసం రెండున్నర గంట క్యూలో ఉండాల్సి వస్తోంది.

తమ డబ్బును తిరిగి తాము తీసుకోవటానికి కూడా ఇన్నేసి గంటలు క్యూలో నిలుచోవాలా? అని మండిపడుతున్న వారు కొందరైతే.. చేతిలో డబ్బుల్లేక.. ఏటీఎంలు పని చేయక తీవ్ర అవస్థలకు గురైనట్లుగా మరికొందరు వాపోతున్నారు. చేతిలో ఉన్న డబ్బు చిత్తుకాగితాల్లా మారిపోయి.. తిరిగి ఆ విలువకు సరిపడా డబ్బులు చేతికి రావటం పట్ల ఆనందాన్ని పలువురు వ్యక్తం చేయటం గమనార్హం. ఏమైనా.. పెద్దనోట్లను మార్చుకోవటానికి కనీసం ఒక తెలుగు సినిమా చూసినంత టైం అయితే పడుతున్న పరిస్థితి. సో.. కొత్త నోట్ల కావాలన్నా.. మీ చేతిలో ఉన్న పాత పెద్ద నోట్లను మార్చుకోవాలన్నా కనీసం రెండున్నర గంటల పాటు సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News