గుడ్డు రూ.10..ట‌మోటా రూ.40..పెట్రోల్ రూ.150

Update: 2018-10-15 09:47 GMT
కొన్నిసార్లు మ‌నిషి క‌క్కుర్తిని చూసిన‌ప్పుడు ఒళ్లు మండిపోతుంది. ఆప‌ద‌లో ఉన్న‌ప్పుడు ఆదుకోకున్నా ఫ‌ర్లేదు.. దోచుకోకుంటే చాలు. ఆ చిన్న విష‌యాన్ని మ‌ర్చిపోయి విప‌త్తు వేళ‌.. ధ‌నార్జ‌నే ధ్యేయంగా బ‌తికేసే మ‌నుషుల్ని చూసిన‌ప్పుడు డ‌బ్బులు త‌ప్పించి ఇంకేమీ అక్క‌ర్లేదా? అన్న భావ‌న క‌లుగ‌క మాన‌దు. నీతులు చెప్పే ప్ర‌భుత్వాలు సైతం ఎన్ని విప‌త్తుల్ని ఎదుర్కొన్నా.. ఎప్ప‌టికి నేర్చుకోని పాఠాల‌తో వ్య‌వ‌హ‌రించే తీరు సామాన్యుల్ని స‌మ‌స్య‌ల సుడిగుండాల్లో దించేస్తుంటుంది.

తిత‌లీ అంటే సీతాకోక చిలుక అన్నఅంద‌మైన పేరు పెట్టిన ప్ర‌కృతి విప‌త్తు సిక్కోలు (శ్రీ‌కాకుళం)ను ఎంత‌లా అత‌లాకుత‌లం చేసిందో చాలామంది తెలుగువారికి తెలియ‌ని ప‌రిస్థితి. అక్క‌డెక్క‌డో ఒడిశాకు కాస్త ద‌గ్గ‌ర‌గా.. తెలుగు రాష్ట్ర రాజ‌ధానుల‌కు అల్లంత దూరాన ఉండే శ్రీ‌కాకుళంలో తుఫాను సృష్టించిన క‌ల‌క‌లం అంతా ఇంతా కాదు.

తుఫాను తీవ్ర‌త త‌గ్గి నాలుగు రోజులు అవుతున్నా.. అది మిగిల్చిన క‌ష్టం నుంచి మాత్రం అక్క‌డి ప్ర‌జ‌లు ఇప్ప‌టికి తేరుకోలేదు.

జ‌రిగిన న‌ష్టాన్నిఎవ‌రికి చెప్పుకోలేక‌.. అలా అని సొంతంగా తీర్చుకోలేక కిందామీదా ప‌డుతున్న వారికి రోజు గ‌డ‌వ‌ట‌మే క‌ష్టంగా మారింది. దానికికార‌ణం లేక‌పోలేదు. తిత‌లీ పుణ్య‌మా అని ర‌వాణా స్తంభించిపోవ‌టంతో ఉన్న వ‌స్తువుల్ని వీలైనంత‌గా దోచేసుకునేలా అమ్ముతున్న వ్యాపారుల కార‌ణంగా నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి. రూ.5 గుడ్డు ఇప్పుడ‌క్క‌డ రూ.10.. అంతేనా.. నిన్న మొన్న‌టి వ‌ర‌కూ 20లీట‌ర్ల వాట‌ర్ క్యాన్ రూ.10 నుంచి రూ.20 అయితే.. ఇప్పుడు ఏకంగా రూ.60 నుంచి రూ.100 వ‌ర‌కూ  వాయించేస్తున్నారు.

ఇక‌.. పెట్రోల్ సంగ‌తి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. లీట‌రు రూ.150 చొప్పున అమ్మేస్తున్నారు. ట‌మోటా కిలో రూ.40.. కూర‌గాయ‌ల ధ‌ర‌ల్ని ఆకాశాన్ని అంటేలా ధ‌ర‌లు చెప్పి బాదేస్తున్నారు. ఇక‌.. పాలు గురించి ఎంత త‌క్కువ‌గా చెప్పుకుంటే అంత మంచిది. తుఫానుకార‌ణంగా వంద‌లాది గ్రామాల్లో క‌రెంటు స‌ప్లై ఆగిపోయి నాలుగైదు రోజులు దాటింది. ఆదివారం నాటికి కూడా దాదాపు 1300 గ్రామాల‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా లేదంటే ప‌రిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు.

అంతేనా.. చిన్న‌..చిత‌కా ఇళ్లు కూలిపోవ‌టం.. ఇంట్లో దుస్తుల‌న్నీ త‌డిచిపోవ‌టంతో.. వాటిని ఆరేసుకోవ‌టానికి క‌రెంటు తీగ‌ల్ని వాడేస్తున్న విచిత్ర‌మైన వైనం సిక్కోలులో క‌నిపిస్తోంది. కూర‌గాయ‌ల ధ‌ర‌లు మండిపోతున్న వేళ‌.. కాస్త ఆర్థిక స్థితి బాగున్న వారు ఏదో ఒక‌ర‌కంగా కొనుగోలు చేస్తుంటే.. ఇక పేదోళ్లు అయితే చెట్ల‌కు ఉన్న బొబ్బాయి కాయ‌ల్ని తుంచేసి వాటిలో ఏదో ఒక కూర చేసుకొని ఆక‌లి బాధ నుంచి బ‌య‌ట ప‌డే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మొత్తంగా సిక్కోలు ప‌రిస్థితి తీవ్రంగా ఉండ‌ట‌మే కాదు.. త‌మ‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోని వైనంపై సిక్కోలు వాసులు య‌మా సీరియ‌స్ గా ఉన్నారు.
Tags:    

Similar News