కార్బెవాక్స్ ని అత్యవసర బూస్టర్ డోస్ గా ప్రకటించాలని డీజీసీఐ కి దరఖాస్తు..!

Update: 2022-05-12 05:12 GMT
భారత దేశంలో నాలుగో దశ కరోనా వ్యాప్తి ఉంటుందని ఇప్పటికీ ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా... ప్రజలందరూ రెండు డోసుల టీకాలను కచ్చితంగా తీసుకోవాలని, రెండు డోసులు తీసుకున్న వారు బూస్టర్ డోసు కూడా తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే కరోనా నియంత్రణ నిమిత్తం బూస్టర్ డోస్ గా కార్బెవాక్స్ టీకాను ఇవ్వాలని ఫార్మా సంస్థ బయోలాజికల్ ఈ డీజీసీఐ అనుమతి కోరినట్లు తెలుస్తోంది.

దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్ట మొదటి ఆర్బీడీ ప్రోటీన్ సబ్యూనిట్ వ్యాక్సిన్ అయిన కార్బెవ్యాక్స్ టీకాను, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆప్ ఇండియా ఇప్పటికే అత్యవసర వినియోగ నిమిత్తము ఆమోదం తెలిపింది. అయితే ప్రస్తుతం 12 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు దీన్ని ఉపయోగిస్తున్నారు. అలాగే కార్బెవ్యాక్స్ పై జరిపిన పరిశోధన ఫలితాల నివేదికను బయోలాజికల్ ఈ సంస్థ డీజీసీఐకి అందజేసింది.

అయితే నివేదిక ప్రకారం... ఇటీవల జరిపిన ఫేజ్ 3 ప్రభావ రహిత - నియంత్రిత క్లినికల్ పరీక్షల్లో ఒడే డోసు బూస్టర్ గా కార్బెవాక్స్ తీసుకున్న వారిలో రోగనిరోధక శక్తి, కొవాగ్జిన్ టీకాలు తీసుకున్న కొవిడ్ నెగిటివ్ పెద్దలలో పరీక్షించి అంచనా వేశారు.

అందుకోసం 18 నుంచి 80 ఏళ్ల వారిలో 416 మంది వాలంటీర్లపై ఈ పరీక్షలు జరిపారు. కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు చేయించుకొని చివరి టీకా తీసుకుని ఆరు నెలలు దాటిన వారికే ఈ కార్బెవాక్స్ టీకా అందించారు.

ప్రభావ రహిత - నియంత్రిత క్లినికల్ పరీక్షలతో పోలిస్తే.. కొవిషీల్డ్ మరియు కొవాక్సిన్ తీసుకున్న వారికి కార్బెవాక్స్ టీకా బూస్టర్ డోసుగా ఇవ్వడం ద్వారా... 28 రోజుల అనంతరం వారిలో ప్రతిరోధకాలను తటస్థీకరించే విషయంలో ఫలితాలు రోగ నిరోధక శక్తిని గణనీయంగా పెంచాయని పరిశోధకులు గుర్తించారు. అందుకే కార్బెవాక్స్ టీకాను అత్యవసర బూస్టర్ డోసుగా పంపిణీ చేసేలా ప్రభుత్వ అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

కేంద్ర వైద్యారోగ్య శాఖ గతంలో సూచించిన మేరకు... మొదటి రెండు టీకాలు ఏదైతే తీసుకున్నారో బూస్టర్ డోసు కూడా అదే తీసుకోవాలని ఉంటుందని వివరించారు. ఈ క్రమంలోనే బూస్టర్ డోసుగా కార్బెవాక్స్ టీకా తీసుకోవచ్చా లేదా అనే విషయంపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని తెలపలేదు. కేంద్రం నిర్ణయం తర్వాతే కార్బెవాక్స్ టీకాను బూస్టర్ డోస్ గా తీసుకోవడం లేదా ఆపడం చేయాలో తెలుస్తుంది.
Tags:    

Similar News