మూడు రాజధానులు ప్రాక్టికల్ గా ఎంతవరకూ పాజిబుల్?

Update: 2019-12-18 05:24 GMT
ఏపీకి ఏదో శాపం ఉన్నట్లుంది. ఇన్నేళ్లు అవుతున్నా.. ఇప్పటివరకూ ఆ రాష్ట్రానికి రాజధాని లేకపోవటం ఆసక్తికరంగా చెప్పాలి. తమకు తాము తోపులుగా చెప్పుకునే ఆంధ్రోళ్లకు రాజధాని శాపం వెంటాడుతూ ఉంటుందన్న వ్యాఖ్యలు పలువురి నోట వినిపిస్తూ ఉంటాయి. మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి ఒక రాష్ట్రంగా ఏర్పాటు అయిన నాటి నుంచి నేటి వరకూ ఆంధ్రా ప్రాంతానికి సంబంధించి రాజధాని నగరం లేని లోటు వెంటాడుతూనే ఉంది.

భాషా ప్రయుక్త రాష్ట్రంగా విడిపోయిన ఏపీ.. కర్నూలు రాజధానిగా ఏర్పాటు చేయాలని భావించారు. అదే సమయంలో తెలంగాణతో జత కలవటంతో రాజధాని ఆలోచనను పక్కన పెట్టేశారు. కర్నూలు నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటంతో రాజధాని కథ మళ్లీ మొదటికి వచ్చినట్లైంది.

విభజన అనంతరం ఏపీ రాజధాని విషయంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక పెద్ద తప్పు చేశారని చెప్పక తప్పదు. ఏపీ రాజధానికి సంబంధించిన నిర్ణయాన్ని రాజకీయాలకు అతీతంగా తీసుకొని ఉంటే బాగుండేది. రాజధాని ఏర్పాటుకు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి.. నిర్ణయం తీసుకొని ఉంటే ఇవాల్టి పరిస్థితి వచ్చేది కాదు.

తమ హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటించిన చంద్రబాబు అందరిని కలుపుకుపోయి ఉంటే ఇవాల్టి పరిస్థితి ఉండేది కాదు. అందుకు భిన్నంగా తన చేతిలో ఉన్న అధికారంతో అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. ఇప్పుడు జగన్ టర్న్ వచ్చింది. ఇప్పుడాయన మూడు రాజధానులుగా చెబుతున్నారు.

అమరావతిని అసెంబ్లీ వ్యవహారాలకు.. కర్నూలును రాజధాని వ్యవహారాలకు.. విశాఖపట్నాన్ని ఆర్థికరాజధానిగా ఏర్పాటు చేయాలన్న జగన్ ఆలోచన వినేందుకు బాగున్నా.. ఆచరణలో అంత తేలికైన విషయం కాదని చెప్పాలి. విశాఖకు మెట్రోరైలు వేస్తే సరిపోతుందన్న జగన్ మాటలో వాస్తవం కొంత ఉన్నా.. రాజధానులతో ఒక రాస్ట్రానికి సంబంధించిన రాజధానికి ఉండాల్సిన గుర్తింపు ఉండదని చెప్పాలి.

జగన్ తాజా నిర్ణయంతో ఒక రాష్ట్రానికి ఒక మహానగరం అన్నది ఏపీ వరకూ లేదని చెప్పక తప్పదు. అదే సమయంలో పాలనా పరంగా ఇబ్బందులు తప్పవని చెప్పాలి. కొన్ని నిర్ణయాలకు అమరావతి.. హైకోర్టు సంబందిత పనులకు కర్నూలు.. ఇక.. ఆర్థిక రాజధానిగా విశాఖ ఉండటం.. ఈ మూడు పట్టణాలకు మధ్య దూరం చాలా ఎక్కువగా ఉండటంతో ప్రయాస తప్పదని చెప్పక తప్పదు. వినేందుకు బాగానే ఉన్నా.. ప్రాక్టికల్ గా మాత్రం మూడు రాజధానులతో ఇబ్బందులు తప్పవు.
Tags:    

Similar News