వలస బతుకుల చావులో కన్నీళ్లు పెట్టించే చిత్రం

Update: 2020-05-08 13:00 GMT
వలస బతుకులు ఎంత దుర్భరమో చాటి చెప్పిన దుర్ఘటన ఇదీ. వాణిజ్య రాజధాని ముంబైలో పొట్టపోసుకునే చత్తీస్ ఘడ్ వలస కార్మికులు తమ సొంతూరుకు బయలు దేరారు. చత్తీస్ ఘడ్ వెళ్లే రైల్వే ట్రాక్ వెంటనే నడవడం మొదలు పెట్టారు. అలా ఔరంగబాద్ వరకు వచ్చారు. ప్యాసింజర్ రైళ్లు ఎలాగూ నడవడం లేదని అదే ట్రాక్ పై పడుకున్నారు. కానీ దేవుడు వారికి దుర్భరమైన చావునిచ్చాడు. గూడ్స్ రైలు మృత్యు శకటమై వారిని కబళించింది.

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఇవాళ ఉదయం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. కర్మాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే ట్రాక్ పై నిద్రిస్తున్న వలస కూలీలపై గూడ్స్ రైలు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 19మంది వలస కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. 50 మంది గాయపడ్డారు. మృతుల్లో మహిళలు - చిన్నారులు ఉన్నారు.

ర్వైల్వే ట్రాక్ పై చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు హృదయ విదారకంగా ఉన్నాయి. కూలీలు తినడానికి చేసుకున్న రొట్టెలు కూడా ట్రాక్ పక్కన పడి ఉన్నాయి. కారం కూరతోపాటు అలా నోటికాడికి వచ్చిన తిండి కూడా తినకుండా కాటికి పోయిన వైనం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ట్రాక్ వద్ద వలస కూలీల శవాలన్నీ ముక్కలు ముక్కలుగా పడి ఉండి బీతావాహ వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. వలస కూలీల జీవితం ఎంత దుర్భరమో.. ఎంతటి విషాదాంతమో గుర్తు చేస్తోంది. వారి రాష్ట్రాలకు వారిని పంపించలేని ప్రభుత్వాల వైఫల్యం.. వలస కార్మికులు పోవాలని మొండి పట్టుదలకు వెరిసి 19 మంది ప్రాణాలు అసువులు బాశాయి..
Tags:    

Similar News