‘మాణిక్ సర్కార్’ ఓటేసినా బీజేపీకే పడుతుందట

Update: 2017-04-16 07:15 GMT
అసలే ఈవీఎంలపై వివాదాలు ముసురుకుంటున్నాయి. ఏ పార్టీకి ఓటేసినా బీజేపీకే పడేలా వాటిని ట్యాంపర్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈవీఎంలను ట్యాంపర్ చేయొచ్చని.. కావాలంటే తాను చేసి చూపిస్తానని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఏకంగా ఎన్నికల సంఘానికే సవాల్ విసిరారు. ఇలాంటి సమయంలో ఓ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు వీటిపై మరింత అనుమానాన్ని పెంచుతున్నాయి.
    
ఈవీఎంలపై అనుమానాలు పెరుగుతున్న వేళ  త్రిపుర బిజెపి అధ్యక్షుడు విప్లవ్‌ దేవ్‌ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని ఇరకాటంలో పడేశాయి. త్రిపుర ముఖ్యమంత్రి - సీపీఎం నేత మాణిక్ సర్కార్ ఓటు కూడా బీజేపీకే పడుతుందని ఆయన అనడంతో మరిన్ని అనుమానాలు మొదలయ్యాయి. 'ఉత్తరప్రదేశ్‌ - మణిపూర్‌ ఎన్నికల్లో మాదిరిగానే త్రిపురలోనూ ఎన్నికలు జరుగుతాయి.  ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ ఓటు వేసినా కూడా అది కమలానికే పడుతుంది. మీకు (మాణిక్‌ సర్కార్‌) దమ్ముంటే వెళ్ళి కేసు పెట్టుకోండి' అంటూ విప్లవ్‌ దేవ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  
    
ఈవీఎంల పనితీరు పట్ల సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఆ సందేహాలను మరింత బలపరిచేలా విప్లవ్‌దేవ్‌ వ్యాఖ్యలున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ఎన్నికల వ్యవస్థపైన, ఎన్నికల కమిషన్‌ పైన ప్రజలు విశ్వాసం కోల్పోకుండా వుండాలంటే తక్షణమే విప్లవ్‌ దేవ్‌ పై తగు చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ను త్రిపుర లెఫ్ట్‌ ఫ్రంట్‌ కమిటీ కోరింది. ఈ మేరకు సిఇసికి అందచేసిన లేఖతో పాటు విప్లవ్‌ దేవ్‌ ప్రసంగాన్ని ప్రచురించిన ఆజ్‌ కల్‌ - దేశ్కర్‌ కథ పత్రికల క్లిప్పింగులను, వీడియో సిడిని కూడా లెఫ్ట్‌ ఫ్రంట్‌ నేతలు అందచేశారు. ఖొవారు జిల్లాలోని తెలియముర పట్టణంలో ఈ నెల 13న జరిగిన బహిరంగ సభలో విప్లవ్‌ ఈ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో వున్న పార్టీకి రాష్ట్ర స్థాయిలో అధ్యక్షుడైన వ్యక్తి ఇలా నోరు పారేసుకోవడాన్ని వామపక్ష సంఘటన తీవ్రంగా ఖండించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News