రంగారెడ్డి టీఆర్ ఎస్ లో టికెట్ల ర‌ణం.. అధినేత‌కు ఆటుపోట్లు!

Update: 2022-06-27 04:22 GMT
ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలే ఉన్నారు. అయితే వీరందరికీ మళ్లీ టికెట్‌ వచ్చే అవకాశాలు అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. వీరిలో కొందరిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రాగా.. మరికొందరిపై ప్రజల్లో కూడా మోహం మొత్తింది. సుదీర్ఘకాలంగా స్థానిక ఎమ్మెల్యేలుగా కొనసాగుతుండడంతో సహజంగానే ఆ నియోజకవర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికల కోసం టీఆర్ఎస్‌ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్‌ను నియమించుకున్న సంగతి తెలిసిందే.

ప్రశాంత్‌కిషోర్‌ టీమ్‌ నిర్వహించే సర్వేల్లో ప్రజావ్యతిరేకత ఎక్కువ ఉన్నవారిని పక్కనపెట్టాలని పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. సర్వేలో ప్రజావ్యతిరేకత ఎక్కువగా ఉన్నట్లు తేలితే సీనియర్‌ నేతలనైనా  పక్కన పెట్టాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం.

ఈ విషయంపై సిట్టింగ్‌ ఎమ్మెల్యేందరికీ టీఆర్ఎస్‌ అధినాయకత్వం సంకేతాలు పంపింది. ఇప్పటికే పీకే టీమ్‌ సర్వేలు మొదలు పెట్టడంతో సిట్టింగ్‌ల్లో ఆందోళన మొదలైంది. సర్వేల్లో వెనుకబడకుండా నిత్యం జనంలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో అయిదారుగురు సిట్టింగ్‌లపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉన్నట్లు సమాచారం. ఇదే వ్యతిరేకత కొనసాగితే వారిని తప్పించి కొత్తవారికి టికెట్లు ఇవ్వడం ఖాయమంటున్నారు. ఇదిలాఉంటే సిట్టింగ్‌లపై వ్యతిరేకత ఎక్కువ ఉన్నచోట్ల ఈసారి తమకు అవకాశం దక్కుతుందని కొందరు నేతలు ఆశపడు తున్నారు. మరోవైపు ముందస్తు ఎన్నికలు వస్తే తాము కూడా బరిలో నిలవాలని కొందరు సీనియర్లు భావిస్తున్నారు.

ఇప్పటికే ఎంపీ, ఎమ్మెల్సీలుగా ఉన్నవారు కొందరు ఎమ్మెల్యేలుగా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి ఆరునూరైనా తాండూరు నుంచి బరిలో దిగుతానని ఇప్పటికే అనేకమార్లు బహిరంగంగా ప్రకటించారు. అదేవిధంగా ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, మరో ఎమ్మెల్సీ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె సైతం వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

అలాగే చేవెళ్ల సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి సైతం ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తిచూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఎంపీ సీటు నిరాకరిస్తే తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నట్లు తెలిసింది. ఆయన రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి స్థానాలపై కన్నేసినట్లు తెలిసింది. ఇక మంత్రి సబితారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి కూడా రాజేంద్రనగర్‌ నుంచి పోటీచేసేందుకు ఆసక్తిచూపుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం కూడా టీఆర్ఎస్‌ టిక్కెట్‌ ఆశిస్తున్నారు. డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి సైతం టికెట్‌ రేస్‌లో ఉన్నారు. దీంతో రంగారెడ్డి జిల్లా టీఆర్ ఎస్‌కు త‌ల‌నొప్పిగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News