శీన‌న్న రూ.4కోట్ల‌కు క‌క్కుర్తి ప‌డ్డారా?

Update: 2017-06-14 04:29 GMT
తెలంగాణ అధికార‌ప‌క్షానికి ఇబ్బందికి గురి చేసే ఉదంతం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇప్ప‌టికే టీఆర్ ఎస్ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌.. ఎంపీ కేకేపై భూముల రిజిస్ట్రేష‌న్ వివాదంపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ‌.. అధికార పార్టీకి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు డీఎస్ (డి.శ్రీనివాస్‌)పై భూ కుంభ‌కోణం ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి రాజ‌కీయాల్లో ఉన్న స్కాంల్లాంటి పెద్ద పెద్ద విష‌యాల్లో పేరు రాని డీఎస్‌..నిరుపేద‌ల‌కు ప్ర‌భుత్వం ఇచ్చిన భూముల్ని దొడ్డిదారిన త‌న అధీనంలోకి తెచ్చుకొని రిజిస్ట్రేష‌న్లు చేయించుకున్న వైనం తాజాగా బ‌య‌ట‌కు రావ‌టం క‌ల‌క‌లంగా మారింది.

మేడ్చ‌ల్ జిల్లా మేడ్చ‌ల్ మండ‌లం గిర్మాపూర్ గ్రామంలో ప్ర‌భుత్వ అసైన్డ్ భూమిని డీఎస్ కొనుగోలు చేశార‌ని చెబుతున్నారు. గ‌తంలో ఈ భూమిని కొనుగోలు చేసేందుకు ప‌లువురు ప్ర‌య‌త్నించినా నో చెప్పిన అధికారులు.. డీఎస్ విష‌యంలో మాత్రం ఓకే చేసేయట‌మే కాదు.. ఏకంగా రిజిస్ట్రేష‌న్ చేసిన వైనం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

మేడ్చ‌ల్ మండ‌లం గిర్మాపూర్ గ్రామ ప‌రిధిలోని గౌడ‌వెల్లి - రాయిలాపూర్ రోడ్డులో స‌ర్వే నెంబ‌రు 221లో 8.9 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి ఉంది. ఇందిర‌మ్మ ప్ర‌ధానిగా ఉన్న వేళ ఆ భూమిని గిర్మాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద‌ల‌కు కేటాయించారు. ఇదిలా ఉండ‌గా.. ఈ భూమిని 1972-73ల‌లో అదే గ్రామానికి చెందిన బొక్క యాదిరెడ్డి అనే రైతు నిరుపేద‌ల నుంచి కొనుగోలు చేశాడు. మూడేళ్ల త‌ర్వాత యాదిరెడ్డి నుంచి అత‌డి సోద‌రుడు రాజిరెడ్డి భూములు కొన్నాడు. ఆయ‌న మృతి చెందిన త‌ర్వాత ఆ భూములు సాయిరెడ్డి.. బ‌ల్వంత్ రెడ్డి.. రఘుప‌తిరెడ్డి పేర్ల మీద విరాస‌త్ చేశారు. అసైన్డ్ భూమి మీద హ‌క్కులు ప్ర‌భుత్వానికే ఉంటాయి. అసైన్డ్ భూముల్ని వాటి ల‌బ్థిదారులు అనుభ‌వించ‌టానికి వీలు ఉంటుందే త‌ప్పించి.. ఇత‌రుల‌కు అమ్మే హ‌క్కు ఉండ‌దు.

అయితే.. అసైన్డ్ దారుల నుంచి చేతులు మారిన భూమిని వెన‌క్కి తీసుకునేందుకు అధికారులు గ‌తంలో నోటీసులు జారీ చేశారు. అయితే.. ఈ భూమిని అనుభ‌విస్తున్న సాయి.. బ‌ల్వంత్‌.. ర‌ఘుప‌తిలు రాజ్య‌స‌భ స‌భ్యుడు డీఎస్ కు.. ఆయ‌న అనుచ‌రుడు ఎ.వి. స‌త్య‌నారాయ‌ణ రావుకు 2015లో అమ్మారు. డీఎస్ పేరిట నాలుగు ఎక‌రాలు.. ఎ.వి. స‌త్య‌నారాయ‌ణ పేరిట రెండు ఎక‌రాలు రిజిస్ట్రేష‌న్ ను మేడ్చ‌ల్ స‌బ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట‌ర్ చేశారు. అనంత‌రం ఈ ఏడాది జ‌న‌వ‌రిలో మ్యుటేష‌న్ కోసం స్థానిక త‌హ‌సీల్దార్ కార్యాల‌యంలో ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

దీనిపై విచార‌ణ జ‌రిపిన రెవెన్యూ అధికారులు మ్యుటేష‌న్ చేయ‌టానికి నో చెప్పారు. చేతులు మారిన అసైన్డ్ భూముల్ని వెన‌క్కి తీసుకునేందుకు మ‌రోసారి నోటీసులు జారీ చేశారు. ఇక్క‌డి భూములు ఇప్పుడు రేటు భారీగా పెరిగింది. ఇప్పుడిక్క‌డ ఎక‌రా రూ.కోటి వ‌ర‌కూ ప‌లుకుతోంది. డీఎస్‌.. అత‌ని అనుచ‌రులు ఎక‌రా రూ.14 ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఓప‌క్క ప్ర‌భుత్వ భూములు ప‌క్క‌దారి ప‌ట్టే అవ‌కాశ‌మే లేద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌లంగా చెబుతున్న వేళ‌లో.. ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహితుడైన డీఎస్ అలాంటి భూముల్ని కొనుగోలు చేసిన వైనం బ‌య‌ట‌కు రావ‌టం గ‌మ‌నార్హం. ఏమైనా.. అన్ని తెలిసిన శీన‌న్న ఇలాంటి ప‌ని చేయ‌టాన్ని ప‌లువురు త‌ప్ప ప‌డుతున్నారు. నాలుగో కోట్ల కోసం ఇంత చెడ్డ పేరు కొని తెచ్చుకుంటారా? అని ప్ర‌శ్నిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News