నిజామాబాద్‌లో 'డీ' ఎస్ క‌ల‌క‌లం!

Update: 2018-06-27 08:55 GMT
నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీలో అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది. కొద్దిరోజులుగా పార్టీ అంత‌ర్గ‌తంగా చోటు చేసుకుంటున్న విభేదాలు తీవ్ర‌స్థాయికి చేరుకోవ‌ట‌మే కాదు.. టీఆర్ఎస్ అధినేత కుమార్తె క‌మ్ పార్టీ ఎంపీ క‌విత స్వ‌యంగా రంగంలోకి దిగారు. పార్టీ సీనియ‌ర్ నేత డి.శ్రీ‌నివాస్ మీద వేటు వేయాల‌న్న సూచ‌న‌ను చేసే వ‌ర‌కూ వ్య‌వ‌హారం వెళ్ల‌టం గ‌మ‌నార్హం.

క‌విత నేతృత్వంలో డీఎస్ పై జిల్లా పార్టీ నేత‌లు తిరుగుబాటు చేశారు. పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు ఆయ‌ప పాల్ప‌డుతున్నారంటూ క‌విత‌కు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్‌లోని క‌విత నివాసానికి వ‌చ్చిన ప‌లువురు టీఆర్ఎస్ నేత‌లు డీఎస్ పై ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. డీఎస్ మీద క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ అధినేత కేసీఆర్ కు లేఖ రాయాలంటూ జిల్లా పార్టీ అధ్య‌క్షురాలు తుల ఉమ‌కు ఎంపీ క‌వితతో పాటు ప‌లువురు నేత‌లు విన్న‌వించారు.

పార్టీ అధినేత త‌న తండ్రే అయిన‌ప్ప‌టికీ.. ప్రోటోకాల్ ఎక్క‌డా మిస్ కాకుండా.. వేలెత్తి చూపించే అవ‌కాశం ఇవ్వ‌కుండా క‌విత వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని చెప్పాలి. డీఎస్ మీద వేటు వేయాల‌ని జిల్లా అధ్యక్షురాలిని కోరి.. పార్టీ అధినేత‌కు విన‌తిప‌త్రాన్ని పంపాలంటూ చెప్పిన క‌విత అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా డీఎస్ పై ఆమె తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ కు నిజామాబాద్ జిల్లా ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టార‌ని.. మొత్తం 9 నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని గెలిపించి అధికారంలోకి రావ‌టానికి కీల‌క‌భూమిక పోషించార‌న్నారు. ఈ కార‌ణంతోనే నిజామాబాద్ జిల్లా అంటే అధినేత కేసీఆర్‌కు చెప్ప‌లేనంత అభిమాన‌మ‌న్నారు. ఈ కార‌ణంతోనే జిల్లాలోని సీనియ‌ర్ రాజ‌కీయ‌నేత‌గా ఉన్న డీఎస్ పార్టీలోకి వ‌స్తానంటే ఆయ‌న్ను సాద‌రంగా ఆహ్వానించార‌న్నారు.

అంత‌ర్రాష్ట్ర స‌ల‌హాదారుగా నియ‌మించి కేబినేట్‌ర్యాంకు ఇవ్వ‌టంతో పాటు రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కూడా అవ‌కాశం ఇచ్చార‌ని గుర్తు చేశారు. అధినేత ఆదేశాల నేప‌థ్యంలో జిల్లా టీఆర్ ఎస్ నేత‌లంతా ఆయ‌న‌కు స‌ముచిత గౌర‌వాన్ని ఇచ్చార‌న్నారు. ఇటీవ‌ల డీఎస్ కుమారుడు బీజేపీలో చేరాన‌ని.. అప్ప‌టి నుంచి వారి కుటుంబంలో బేధాభిప్రాయాలు వ‌స్తున్న‌ట్లు చెప్పారు. డీఎస్ వైఖ‌రిలోనూ మార్పు క‌నిపిస్తోంద‌న్నారు.

త‌న కుమారుడు ప‌ని చేస్తున్న పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించాల‌ని పార్టీ నేత‌ల్ని డీఎస్ ఒత్తిడి చేస్తున్నార‌న్నారు. ఒక వ్య‌క్తి కార‌ణంగా క్యాడ‌ర్ లో ఇబ్బందులు ఎదురుకావ‌టంతో తాను బ‌య‌ట‌కు రావాల్సి వ‌చ్చింద‌న్నారు. కుటుంబంలో ఏమైనా తేడాలుంటే ప‌రిష్క‌రించుకోవాలే కానీ న‌మ్మిన పార్టీని నాశ‌నం చేయ‌కూడ‌ద‌న్నారు. త‌న కొడుకు చేరిన పార్టీకి ప‌ని చేయాల‌ని ఆరేడు నెల‌లుగా డీఎస్ ఒత్తిడి చేస్తున్న‌ట్లు ఆరోపించిన ఆమె.. పార్టీకి వ్య‌తిరేకంగా బిడ్డ‌లు వ్య‌వ‌హ‌రించినా క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని కేసీఆర్ త‌ర‌చూ హెచ్చ‌రిస్తుంటార‌న్నారు. డీఎస్ వ్య‌వ‌హారంలోనూ అలానే ఉండాల‌ని తాము కోరుకుంటున్న‌ట్లు చెప్పారు. పార్టీలో చోటు చేసుకున్న ఇలాంటి వ్య‌వ‌హారాల్ని వెంట‌నే ప‌రిష్క‌రిస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో నిజామాబాద్ జిల్లా మొత్తం టీఆర్ఎస్ జెండాతో రెప‌రెప‌లాడుతోంద‌న్నారు. డీఎస్‌పై త‌క్ష‌ణ‌మే వేటు వేయాల‌న్న విష‌యాన్ని త‌న మాట‌గా క‌విత చెప్పేసిన‌ట్లే. కుమార్తె అంత క్లియ‌ర్ గా చెప్పిన త‌ర్వాత కేసీఆర్ మాత్రం ఊరుకుంటారా ఏంటి?
Tags:    

Similar News