మ‌ధుయాష్కీకి క‌విత వార్నింగ్‌!

Update: 2018-10-03 06:50 GMT
క‌విత‌కు కోపం వ‌చ్చింది. త‌న అడ్డా అయిన నిజామాబాద్ లో త‌న ప్ర‌త్య‌ర్థి అయిన మాజీ ఎంపీ.. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత  మ‌ధు యాష్కీకి హెచ్చ‌రిక‌లు చేశారు. ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకొని మాట్లాడాల‌న్నారు. యాష్కీ వాడిన బాష బాగోలేద‌ని.. ఆయ‌న మాదిరి తాను దిగ‌జారి మాట్లాడ‌లేన‌ని ఆమె అన్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ పైనా.. మంత్రి కేటీఆర్ ల‌పై విమ‌ర్శ‌లు చేసే స్థాయి ఆయ‌న‌కు లేద‌న్నారు. నిజామాబాద్ ఎంపీగా యాష్కీ ప‌దేళ్లు ప‌ని చేస్తే.. కేంద్రం నుంచి రూ.400 కోట్లు తీసుకురాలేద‌ని.. త‌న నాలుగేళ్ల కాలంలో రూ.500 కోట్లు తెచ్చిన‌ట్లుగా చెప్పుకున్నారు.

ప‌దేళ్లు ఎంపీగా ఉండి యాష్కీ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో లేకుండా పోయార‌ని.. కానీ తాను మాత్రం నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉన్న‌ట్లు చెప్పారు. ఇంత‌కీ.. యాష్కీ మీద క‌విత‌కు అంత కోపం ఎందుకు వ‌చ్చింది?  ఇంత‌కీ ఆయ‌నేం అన్నారు?  అన్న విష‌యంలోకి వెళితే.. సాఫ్ట్ గా క‌నిపించే ఈ మాజీ ఎంపీ క‌విత‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లే చేశారు.

ప్రైవేటు విద్యా సంస్థ‌ల‌ను బెదిరించి డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నార‌ని.. తెలంగాణ జాగృతి పేరిట వ‌సూళ్లు చేశార‌ని ఆయ‌న‌ చెప్పారు. మోడీ.. కేసీఆర్ ల మ‌ధ్య సంబంధాల్ని.. కేసీఆర్ కుటుంబ స‌భ్యుల అక్ర‌మాల‌ను త్వ‌ర‌లోనే బ‌య‌ట‌పెడ‌తామ‌న్న ఆయ‌న‌.. ఎన్నిక‌ల వేళ భ‌య‌పెట్టేందుకే రేవంత్‌.. జ‌గ్గారెడ్డిల‌పై కేసులు పెట్టిన‌ట్లుగా చెప్పారు.

దేశ‌వ్యాప్తంగా 12 వేల మంది రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటే.. అత్య‌ధికంగా రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న జాబితాలో తెలంగాణ రెండో స్థానంలో ఉంద‌న్నారు.

గడీల పాల‌న‌ను కూల్చేందుకే తాము కూట‌మి ఏర్పాటు చేసిన‌ట్లుగా చెప్పిన యాష్కీ.. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌కు గులాం అవుదామా?  ప్ర‌జాస్వామ్య తెలంగాణ కోరుకుందామా? అన్న‌ది ప్ర‌జ‌లే డిసైడ్ చేయాల‌న్నారు. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో తాను నిజామాబాద్ నుంచే పోటీ చేయ‌నున్న‌ట్లు యాష్కీ వెల్ల‌డించారు.

మ‌రి.. రానున్న రోజుల్లో ముఖాముఖిన త‌ల‌ప‌డే యాష్కీను క‌విత అంత తేలిగ్గా వ‌దిలిపెడ‌తారా?  అందునా.. సూటిగా విమ‌ర్శ‌లు చేసే త‌త్త్వం ఉన్న యాష్కీ మాట‌ల నేప‌థ్యంలో క‌విత మ‌రింత క‌టువుగా హెచ్చ‌రిక‌లు చేయ‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 


Tags:    

Similar News