అవిశ్వాసంపై తంబీలు అలా.. గులాబీ నేత ఇలా

Update: 2018-07-19 12:27 GMT
కేంద్ర స‌ర్కారుపై ఏపీ అధికార‌ప‌క్ష నేత‌లు పెట్టిన అవిశ్వాస తీర్మానం చ‌ర్చ‌కు రానున్న సంగ‌తి తెలిసిందే. తాము పెట్టిన తీర్మానానికి అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు లేఖ‌లు రాయ‌టం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ వ్య‌వ‌హారంపై టీఆర్ ఎస్ నేత‌లు ఒక‌లా.. త‌మిళ తంబీలు మ‌రోలా స్పందిస్తున్న వైనం ఆస‌క్తిక‌రంగా మారింది.

కేంద్రం నుంచి ఏపీ ప్ర‌త్యేక ప్రోత్సాహ‌కాలు కోరితే తాము వ్య‌తిరేకిస్తామ‌ని.. విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న హామీల అమ‌లుకు త‌మ పార్టీ క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. గ‌తంలో చెప్పిన‌ట్లే టీడీపీకి అండ‌గా నిలుస్తామ‌న్నారు. అయితే.. ఏపీకి ప్ర‌త్యేక హోదా అన్న‌ది విభ‌న చట్టంలో లేద‌న్న టీఆర్ ఎస్ లోక్ స‌భాప‌క్ష ఉపనేత వినోద్ కుమార్ స్ప‌ష్టం చేశారు.

ప్ర‌త్యేక హోదా అన్న‌ది దేశంలో మ‌రెక్క‌డా లేద‌ని.. దానికి కోర‌టం ఏమిటంటూ ప్ర‌శ్నించారు. దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నా.. ఒక్క ఏపీని మాత్ర‌మే ముక్క‌లు చేయ‌టం ఏమిటి? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానాన్ని వినోద్ చెబితే బాగుంటుంద‌న్న మాట వినిపిస్తోంది.

ఏపీకి ప్రోత్సాహ‌కాలు ఇస్తే తెలంగాణకు న‌ష్టం జ‌రుగుతుంద‌ని.. హైద‌రాబాద్ ప‌రిశ్ర‌మ‌లు విజ‌య‌వాడ‌కు త‌ర‌లివెళ్లే అవ‌కాశం ఉంద‌న్నారు. ఇది తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌కు న‌ష్టం వాటిల్లేలా చేస్తుంద‌న్నారు. మ‌రోవైపు త‌మిళ తంబీలు సైతం ఏపీ అధికార‌ప‌క్షం ఇచ్చిన హోదా తీర్మానానికి తాము మ‌ద్ద‌తు ఇవ్వ‌లేమ‌న్న విష‌యాన్ని తేల్చేశారు. బీజేపీతో అన్నాడీఎంకేకు ఉన్న ర‌హ‌స్య స్నేహం తాజాగా బ‌య‌ట‌ప‌డిపోయింది. తాము అవిశ్వాస తీర్మానంలో బీజేపీకి అండ‌గా నిలుస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. త‌మిళ‌నాడు సీఎం ప‌ళ‌నిస్వామి తాజాగా మాట్లాడుతూ తాము అవిశ్వాస తీర్మానం తీసుకురాలేద‌ని.. తాము కేంద్రానికి మ‌ద్ద‌తు ఇస్తామ‌న్నారు.

అన్నాడీఎంకే వైఖ‌రి ఇలా ఉంటే.. బాబు అడిగితే మ‌ద్ద‌తు ఇస్తామ‌ని చెప్పిన టీఆర్ ఎస్ నేత‌లు ప‌లు కండిష‌న్లు పెట్ట‌ట‌మే కాదు.. బాబు తీరును త‌ప్పు ప‌ట్టారు. నాలుగేళ్లు బీజేపీతో జ‌ట్టుక‌ట్టి ఈ రోజున అవిశ్వాసం పెట్ట‌టం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. నాలుగేళ్ల పాటు టీడీపీ.. బీజేపీ జ‌ట్టుక‌ట్టిన‌ప్పుడు ప్ర‌త్యేక హోదా గురించి అడ‌గ‌లేద‌న్న వైనాన్ని గుర్తు చేశారు. అవిశ్వాసంపై చ‌ర్చ‌ను తెలంగాణ ప్ర‌యోజ‌నాల కోసం తాము వినియోగిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఏతావాతా బాబు పార్టీ పెట్టిన అవిశ్వాసం ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశం కంటే కేంద్రం త‌మ‌కు చేయాల్సిన అంశాల మీద‌నే ఆయా పార్టీలు గ‌ళం విప్పే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.


Tags:    

Similar News