టీఆర్ ఎస్ నాయ‌కుల్లో కొత్త లెక్క‌లు

Update: 2016-08-26 22:30 GMT
తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీసుకున్న జిల్లాల విభజన నిర్ణయం అధికార పార్టీ నేతల మనసులను కలుపుతుంది. తెలుగు రాష్ర్టాల్లో ఆపరేషన్ ఆకర్ష్‌ కు మొద‌ట‌ తెరలేపిన సీఎం కేసీఆర్ ప్రజాబలం ఉన్న నేతలను గులాబీ పార్టీలోకి ఆహ్వనించారు. అయితే కొత్త నాయ‌కుల‌ చేరిక తరువాత నేతల మద్య అంతర్గత వైరం కొనసాగింది. ఒకరినొకరు పలకరించుకునే పరిస్థితులు లేకుండా పోయాయి. తన రాజకీయ అవకాశాలకు ఇంకొకరు పోటీకి వస్తున్నారంటూ పలువురు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. వీటన్నింటికి తెరదించుతూ అందరి నాయకులను కలుపుకుని వెళ్లేలా సీఎం కేసీఆర్ కొత్త జిల్లాల రాజకీయానికి తెరదీశారు. ఈ ప్లాన్ బాగా వ‌ర్క‌వుట్ అయింద‌ని తెలుస్తోంది.

ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించే వరంగల్ టీఆర్ ఎస్ నేతలను జిల్లాల విభజన ఒక్క తాటిపైకి తీసుకువచ్చింది. మహరాష్ట్రతో తెలంగాణ సర్కారు ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో డిప్యూటి సీఎం కడియం శ్రీహరి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశానికి నేతలంతా కలిసి వచ్చారు. అందరు ఒకే వేదికను పంచుకున్నారు. ఇక తెలంగాణ రాజకీయాలలో సీనియర్ నేతలుగా ఉన్న కడియం శ్రీహరి - ఎర్రబెల్లి  దయాకర్‌ రావుల మద్య రాజకీయ వైరం రగులుతూనే ఉంది. రాజకీయాలలో ఇద్దరు కలసి ఒకే సారి ఆరంగ్రేటం చేశారు. టీడీపీలో కొనసాగుతూ వరంగల్ జిల్లాలో పట్టుకోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఎన్టీఆర్ - చంద్రబాబు వద్ద పలుకుబడి పెంచుకునేందుకు పోటీపడ్డారు. అందులో ఒకరు మాస్ లీడర్‌ గా ముద్రపడి ఐదు పర్యాయాలు అసెంబ్లీకి ఎన్నికయిన ఎర్రబెల్లి దయాకర్‌ రావు అయితే మరొకరు సీనియర్ దళిత నేతగా తెలంగాణ డిప్యూటి సిఎంగా ఉన్న కడియం శ్రీహరి. ఓరుగల్లు జిల్లాలో రాజకీయ ప్రత్యర్థులుగా ముద్రపడ్డ ఇద్దరు నేతలకు ఒకరంటే ఒకరికి గిట్టదు. గ‌తంలో ఒకే పార్టీలో ఉన్న మద్యలో వేర్వేరు పార్టీలలోకి మారినా తాజాగా తిరిగి అధికార పార్టీ గూటి కి చేరుకున్న ఇప్పటివరకు పలకరించుకున్న పాపాన పోలేదు. ఒకే ఊరు నుండి రాజకీయాలలోకి వచ్చిన ఈ నేతలకు తాజాగా మాటలు కలిశాయని సమాచారం.

టీఆర్ ఎస్ సీనియర్‌ నేత వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గతంలో టిడిపిలోనే పనిచేశారు. ఆయన సోదరులు దివంగత మంత్రి ప్రణయ్‌ భాస్కర్ టిడిపి నుండి రాజకీయ ఆరంగ్రేటం చేసి తొలిసారిగా ఆనాటి హన్మకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది ఎన్టీఆర్ క్యాబినెట్‌ లో క్రీడలు యువజన సర్వీసుల శాఖమంత్రిగా పనిచేస్తూ 1996లో అనారోగ్యంతో మరణించారు. ఆయన రాజకీయ వారసునిగా ఆరంగ్రేటం చేసిన వినయ్ భాస్కర్ తెలంగాణ ఉద్యమ పరిస్థితులలో టీఆర్ ఎస్‌ లో చేరారు. పార్టీలో ఆయన బడుగు బలహీన వర్గాల నాయకునిగా ముద్రవేసుకున్నారు. సీనియర్ నాయకులతో సత్సంబందాలు నెరుపుతున్న వినయ్ పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబంతో సన్నిహిత సంబందాలు ఏర్పరుచుకున్నారు. కేసీఆర్ కూడ వినయ్‌కి అన్ని విధాలుగా అండదండగా ఉన్నారు. ఉద్యమ సమయంలో జిల్లా లో ఏకైక టీఆర్ ఎస్ ఎమ్మెల్యేగా ఆయనకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. సీనియర్ గిరిజన నేతగా ఉన్న చందులాల్‌ ను పిలిచి మరీ కేసీఆర్ తన క్యాబినేట్ లో చేర్చుకున్నారు. వరంగల్ జిల్లాలో బలంగా ఉన్న లంబాడా సామాజిక వర్గానికి చెందిన గ‌తంలో త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిగా ఉన్న‌ డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌ లతో సత్సంబందాలు మొద‌లుపెట్టారు.మొత్తంగా జిల్లాల విభ‌జ‌న అధికార పార్టీ నేత‌ల మ‌ధ్య అన‌వ‌స‌ర వివాదాల‌కు, అపోహ‌ల‌కు ఫుల్ స్టాప్ పెట్టిన‌ట్లుగా ఉంద‌ని చెప్తున్నారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లోనే రాజ‌కీయ చైత‌న్యం ఎక్కువ‌గా ఉన్న జిల్లాలో వార్ స‌మ‌సిపోవ‌డం ఇందుకు నిద‌ర్శ‌నమ‌ని పేర్కొంటున్నారు.
Tags:    

Similar News