టీఆర్ ఎస్‌ కు గుబులు పుట్టిస్తున్న‌ స‌ర్వే

Update: 2018-10-29 07:20 GMT
తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో గెలుపెవ‌రిది? గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ మ‌రోసారి త‌న పార్టీని విజ‌య తీరాల‌కు చేరుస్తారా? మ‌హా కూట‌మి ధాటికి చ‌తికిల‌ప‌డ‌తారా? రాష్ట్రవ్యాప్తంగా ఎక్క‌డ చూసినా ఇదే చ‌ర్చ‌. టీవీ ఛానెళ్లు ఇవే అంశాల‌పై నిరంత‌రం చ‌ర్చా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ ఊద‌ర‌గొడుతున్నాయి. అనేక స‌ర్వే సంస్థ‌లు త‌మ అంచ‌నాలు వెల్ల‌డిస్తూ జ‌నం దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. టైమ్స్ నౌ గ్రూపుకు చెందిన ఈటీ నౌ కూడా ఇలాంటి ఓ స‌ర్వే నిర్వ‌హించి.. తాజాగా ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది. ఈ స‌ర్వే ఫ‌లితాలు చూసి మ‌హా కూటమి నేత‌లు - అభిమానులు ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతుండ‌గా.. టీఆర్ ఎస్ అభ్య‌ర్థులు గుండెలు బాదుకుంటున్నారు.

తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో మ‌హాకూట‌మికే అడ్వాంటేజ్ ఉంద‌ని ఈటీ నౌ స‌ర్వేలో తేలింది. ఈ కూట‌మికి 67-81 స్థానాలు వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని అంచ‌నా వేసింది. ఇక టీఆర్ ఎస్‌ కు 35-40 సీట్లు రావొచ్చ‌ని జోస్యం చెప్పింది. ఎంఐఎంకు 5-7 - బీజేపీకి 0-3 సీట్లు వ‌స్తాయ‌ని ఈటీ నౌ స‌ర్వే తేల్చింది. ప్ర‌స్తుతం ఈ స‌ర్వే ఫ‌లితాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. దీంతో ఇన్నాళ్లూ గెలుపుపై ధీమాతో ఉన్న కారు పార్టీ అభ్య‌ర్థులు తాజా కొంత ఆందోళ‌న చెందుతున్న‌ట్లు తెలుస్తోంది.

వాస్త‌వానికి ఈ స‌ర్వే ఫ‌లితాలు కేసీఆర్‌ కు ముందే లీక‌య్యాయ‌ని కూడా కొంద‌రు చెబుతున్నారు. అందుకే ఆయ‌న‌కు త‌మ విజ‌యంపై విశ్వాసం స‌న్న‌గిల్లింద‌ని.. ఫ‌లితంగా పార్టీ మేనిఫెస్టోలో అనేక వ‌రాల జ‌ల్లు కురిపించి తిరిగి జ‌నాల‌ను ఆక‌ర్షించే య‌త్నం చేశార‌నీ వారు విశ్లేషిస్తున్నారు. వాస్త‌వానికి తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఇప్ప‌టికే ప‌లు స‌ర్వేలు త‌మ అంచ‌నాలు వెల్ల‌డించాయి. అయితే, ఆ సంస్థ‌ల్లో చాలావ‌ర‌కు నిఖార్సైనవి కానే కావు. పార్టీల నుంచి డ‌బ్బులు తీసుకొని.. వాటికి అనుకూల‌మైన ఫ‌లితాలు చూపిస్తార‌నే ఆరోప‌ణ‌లూ వాటిపై ఉన్నాయి. అయితే, ప్ర‌తిష్ఠాత్మ‌క టైమ్స్ నౌ గ్రూపుకు చెందిన సంస్థ కావ‌డంతో ఈటీ నౌ స‌ర్వేను ఎవ‌రూ తేలిగ్గా తీసుకోవ‌డం లేదు. మ‌రి ఈ స‌ర్వే అంచ‌నాలు నిజ‌మ‌వుతాయా? లేక కేసీఆర్ జాదూ చేసి తిరిగి జ‌నాన్ని త‌న‌వైపుకు తిప్పుకుంటారా? అనే విష‌యాలు తెలియాలంటే డిసెంబ‌రు 11 వ‌ర‌కు వేచి చూడాల్సిందే!

Tags:    

Similar News