కూల్ గా అధినేత‌.. టెన్ష‌న్ ప‌డుతున్న‌నేత‌లు!

Update: 2019-02-09 06:17 GMT
ఎన్నిక‌లు ముగిసి.. ప్ర‌భుత్వం ఏర్పాటు చేసి ఇంచుమించు రెండు నెల‌లు అవుతున్నా.. ఒక్క‌రంటే ఒక్క మంత్రితో నెగ్గుకొస్తున్న కేసీఆర్ ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. ఏంది సార్‌.. ప‌ద‌వులు మీకేనా?  మాకివ్వ‌రా? అనే ద‌మ్ము ధైర్యం ఎవ‌రికి లేని ప‌రిస్థితి. కేసీఆర్ క‌రుణ త‌మ‌పై ప‌డితే అదే అదృష్టంగా ఫీల్ అవుతున్న వారే కానీ.. ఎవ‌రూ నోరెత్తి మాట్లాడ‌టానికి.. సార్ ద‌గ్గ‌ర స‌మాచారం తీసుకోవ‌టానికి కానీ సాహ‌సం చేయ‌ని ప‌రిస్థితి.

గ‌డిచిన మూడు రోజులుగా మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ పైన ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపిస్తున్నా.. రేపు (ఆదివారం) ఖాయంగా విస్త‌ర‌ణ ఉంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.ఆదివారం వ‌సంత పంచ‌మి కావ‌టంతో విస్త‌ర‌ణ‌కు కేసీఆర్ డిసైడ్ అయిన‌ట్లుగా చెబుతున్నారు. బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా మంత్రులు కొంద‌రైనా ఉండ‌కుంటే బాగోద‌న్న భావ‌న‌తో పాటు.. బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టాల్సిన ఆర్థిక మంత్రి లేకుంటే.. ముఖ్య‌మంత్రే పెట్టాల్సి ఉంటుంద‌ని చెబుతున్నారు. దీనికి తోడు లోక్ స‌భ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస్తున్న నేప‌థ్యంలో ఆదివార‌మే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఖాయ‌మ‌న్న మాట ప‌లువురి నోటి నుంచి వ‌స్తోంది.

కొన్ని మీడియా సంస్థ‌లు సైతం ఇప్ప‌టికే ఇదే విష‌యాన్ని చెబుతూ క‌థ‌నాలు అచ్చేశాయి. అయితే.. వారంతా కూడా అంచ‌నాల‌తో క‌థ‌నాలు రాయ‌ట‌మే కానీ.. క‌చ్ఛిత‌మైన స‌మాచారం ఎవ‌రికి లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. గ‌తంలో ఎప్పుడూ లేని విచిత్ర వాతావ‌ర‌ణం నెల‌కొంద‌ని.. ముఖ్య‌మంత్రి తీసుకునే నిర్ణ‌యాల‌కు సంబంధించిన స‌మాచారం బ‌య‌ట‌కు రావ‌టం లేద‌ని.. ఇంత గుట్టు గ‌తంలో ఎప్పుడూ లేద‌ని చెబుతున్నారు.

అంచ‌నాలు నిజ‌మై.. అనుకున్న‌ట్లు జ‌రిగితే..ఉమ్మ‌డి జిల్లాల ప్రాతిపదిక జిల్లాకు ఒక‌రిని చొప్పున తీసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఒక‌వేళ ఆదివారం విస్త‌ర‌ణ లేకుంటే.. ఈ నెల 24న జ‌రిపే అవ‌కాశం ఉంద‌ని.. అది కూడా లేకుంటే ఎన్నిక‌ల త‌ర్వాతే ఏర్పాటు చేస్తార‌ని చెబుతున్నారు.

కేబినెట్ కు సంబంధించి ఎవ‌రికి ఎలాంటి స‌మాచారం లేక‌పోవ‌టంతో మొన‌గాళ్లు లాంటి నేత‌లు సైతం మౌనంగా కూర్చోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. నోట్లో నుంచి ఏ మాట వ‌స్తే.. అది ఏ విధంగా మారి త‌మ కొంప మునుగుతుందోన‌న్న సందేహ‌మే దీనికి కార‌ణంగా చెప్పొచ్చు. కేబినెట్ విస్త‌ర‌ణ మొత్తం కేసీఆర్ ఇష్టానికి త‌గ్గ‌ట్లు జ‌రుగుతుండ‌టం... ఎలాంటి ఒత్తిళ్లు ఆయ‌న మీద లేక‌పోవ‌టంతో ఎవ‌రికి ఛాన్స్ ల‌భిస్తుంద‌న్నటెన్ష‌న్ అంద‌రు నేత‌ల్లో ఎక్కువ అవుతోంది.

ఎవ‌రికి వారు న‌రాలు తెగేంత టెన్ష‌న్ ను అనుభ‌విస్తుంటే.. కేసీఆర్ మాత్రం కూల్ గా ఉన్నార‌ని చెబుతున్నారు. కేబినెట్ లోకి ఎవ‌రిని తీసుకోవాల‌న్న అంశంపై కేసీఆర్ ఇప్ప‌టికే క్లారిటీగా ఉన్నార‌ని.. కాకుంటే..త‌న మ‌న‌సులోని మాట‌ను ఎవ‌రికీ చెప్ప‌లేద‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో కామ్ గా ఉన్న కేసీఆర్ వ్య‌వ‌హారశైలితో గులాబీ నేత‌లు న‌రాలు తెగేంత ఉత్కంట‌తో ఉన్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.



Tags:    

Similar News