ఢిల్లీలో గులాబీ పార్టీ ఆఫీస్.. శంకుస్థాపనకు డేట్ ఫిక్స్

Update: 2021-08-25 03:42 GMT
ఆసక్తికర నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తాజాగా జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయనో కొత్త విషయాన్ని వెల్లడించారు. ఆ మధ్యన కేంద్రంలోని మోడీ సర్కారు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమిని కేటాయించటం తెలిసిందే. తాజాగాఇప్పుడా భూమిలో పార్టీ ఆఫీసును నిర్మించాలని కేసీఆర్ డిసైడ్ చేశారు.

రానున్న రోజుల్లో కేంద్రంలో చక్రం తిప్పాలన్న అభిలాష కేసీఆర్ లో ఎప్పటి నుంచో వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ఇప్పటికి పలుమార్లు ప్రస్తావనకు తీసుకురావటమే కాదు.. మాటల్లో తన విజన్ చెప్పుకొచ్చారు. కానీ.. అవన్నీ మాటలకే పరిమితమయ్యాయే తప్పించి చేతల్లోకి రాలేదు. తాజా నిర్ణయాన్ని చూస్తుంటే.. గతంలో తాను చెప్పిన మాటల్ని చేతల్లోకి తెచ్చేందుకు వీలుగా కేసీఆర్ నిర్ణయం ఉందని చెప్పాలి. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. దేశ రాజధానిలో తెలుగు ప్రాంతాలకు చెందిన ఒక ప్రాంతీయ పార్టీ ఆఫీసును ఓపెన్ చేయటం.

వచ్చే నెల 2న (సెప్టెంబరు) ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు శంకుస్థాపనను చేయనున్నారు.ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు.. పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు.. ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలు పాల్గొంటారని చెబుతున్నారు. తమ పార్టీ ఆఫీసును ఏర్పాటు చేయటం కోసం కేంద్రానికి టీఆర్ఎస్ అఫ్లికేషన్ పెట్టుకోగా.. మోడీసర్కారు అందుకు అంగీకరించింది. 2020 అక్టోబరు 9న 1100 చదరపుమీటర్ల స్థలాన్ని కేటాయించింది. ఇందుకోసం రూ.20 కోట్ల మొత్తాన్ని చెల్లించింది. అంతేకాదు.. ఏడాదికి రూ.20లక్షల చొప్పున వార్షిక అద్దెగా చెల్లించనుంది.

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని అభిలాష ఉన్న కేసీఆర్.. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే తమ పార్టీ ఆఫీసును పూర్తి చేయాలన్న యోచనలోఉన్నట్లు చెబుతున్నారు. మరి.. ఈ భవనం కోసం కేసీఆర్ భారీ ప్లానింగ్ ఎలా ఉంటుందన్నది రానున్న రోజుల్లో బయటకు రానుంది. మొత్తంగా దేశ రాజధానిలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఏర్పాటు కొత్త రాజకీయానికి తెర తీసినట్లేనని చెప్పక తప్పదు.
Tags:    

Similar News