తెరాస ఖాతాలో మ‌రో ఎమ్మెల్యే స్థానం..!

Update: 2015-09-25 09:27 GMT
తెలంగాణ‌లో త‌మ ఎమ్మెల్యే స్థానాల‌ను పెంచుకుంటూ పోతున్న అధికార తెరాస తాజాగా మ‌రో ఎమ్మెల్యే స్థానంపై క‌న్నేసింది. సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో కాంగ్రెస్ సీనియ‌ర్ ఎమ్మెల్యే పి కిష్టారెడ్డి మ‌ర‌ణంతో జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో తెరాస పోటీ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ తెలంగాణ భారీ నీటిపారుద‌ల శాఖా మంత్రి హ‌రీష్‌ రావు ప్ర‌త్యేక దృష్టి సారించారు. మెద‌క్ జిల్లా రాజ‌కీయాలపై ఆధిప‌త్యం కోసం ట్రై చేస్తున్న హ‌రీష్‌ రావు ఇక్క‌డ త‌న అనుచ‌ర‌గ‌ణంలో ఒక‌రికి టిక్కెట్టు ఇప్పించి గెలిపించుకోవాల‌ని చూస్తున్నారు.

దీంతో నిన్న‌టి వ‌ర‌కు ఈ నియోజ‌క‌వ‌ర్గం గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోని ఆయ‌న త‌ర‌చు ఇక్క‌డ ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు ఎలాంటి అవ‌స‌రాలు వ‌చ్చినా త‌మ‌ను సంప్ర‌దించాల‌ని చెపుతున్నారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మ‌ర్ల ఏర్పాటు కోసం ఎవ‌రైనా డ‌బ్బులు అడిగితే రైతులు త‌మ‌ను సంప్ర‌దించాల‌ని ఆయ‌న చెపుతున్నారు. జిల్లాలో వెన‌క‌ప‌డిన ప్రాంత‌మైన ఖేడ్ గురించి ఇప్ప‌టివ‌ర‌కు ఎవ్వ‌రు ప‌ట్టించుకోలేద‌ని...తెరాస ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఇప్ప‌టికే రెండు మార్కెట్ యార్డుల‌తో పాటు రూ.13 కోట్ల‌తో గిడ్డంగులు కూడా నిర్మించామ‌ని ఆయ‌న చెప్పారు.

వాస్త‌వానికి రెండు తెలుగు రాష్ర్టాల్లో ఎవ‌రైనా ఎమ్మెల్యే చ‌నిపోతే అక్క‌డ మృతిచెందిన కుటంబ స‌భ్యుల‌ను ఏక‌గ్రీవం చేస్తూ వ‌స్తున్నారు. రాష్ర్ట విభ‌జ‌న జ‌రిగాక‌ ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు మూడు ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. ఆళ్ల‌గ‌డ్డ‌లో దివంగ‌త శోభా నాగిరెడ్డి కుమార్తె ఏక‌గ్రీవం అవ్వ‌గా, నందిగామ‌ - తిరుప‌తిలో మాత్రం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైకాపా పోటీ చేయ‌క‌పోయినా కాంగ్రెస్ పోటీ చేసి ఓట‌మిపాలైంది. అయితే ఖేడ్ విష‌యంలో మాత్రం భిన్న‌మైన వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది.

కిష్టారెడ్డి కుటుంబ స‌భ్య‌ల‌ను ఏక‌గ్రీవం చేసే విష‌యంలో కాంగ్రెస్‌ లోనే భిన్నాభిప్రాయాలున్నాయి. దీంతో తెరాస నాయ‌కులు కూడా కిష్టారెడ్డి కుటుంబ స‌భ్యుల‌ను బ‌రిలోకి దింపితే ఆలోచిస్తారేమోగాని ఇత‌రుల‌కు టిక్కెట్టు ఇస్తే ఖ‌చ్చితంగా ఇక్క‌డ త‌మ అభ్య‌ర్థిని బ‌రిలోకి దింపాల‌ని చూస్తున్నారు. అందుకే హ‌రీష్‌ రావు ఖేడ్‌ పై ప్ర‌త్యేక దృష్టి పెట్టి ఇక్క‌డ తెరాస‌ను గెలిపించేందుకు పావులు క‌దుపుతున్నారు.
Tags:    

Similar News