నిజామాబాద్ లో ఆపరేషన్ ఆకర్ష్..అరవింద్ కు కళ్లెమేసేందుకేనట!

Update: 2020-02-14 02:30 GMT
తెలంగాణలో అధికార పార్టీ  తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ ఎస్) 2014 ఎన్నికల తర్వాత ప్రయోగించిన ఆపరేషన్ ఆకర్ష్ మంత్రదండాన్ని మరోమారు ప్రయోగించేందుకు రంగం సిద్దం చేస్తోందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. అయితే ఈ సారి ఈ దండాన్ని ప్రయోగానికి కారణం... ఎమ్మెల్యే - ఎంపీ స్థాయి నేతలను ఆకర్షించేందుకు కాదట. కేవలం నగర పాలక సంస్థలోని కార్పొరేటర్ స్థాయి నేతలను తమ పార్టీలోకి లాగేసేందుకు టీఆర్ ఎస్ ఈ మంత్రాన్ని ప్రయోగించేందుకు కార్యరంగం సిద్ధం చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కార్పొరేటర్ స్థాయి నేతలను లాగేందుకు ఆపరేషన్ ఆకర్ష్ అవసరమా? అంటే... అవతలి వ్యక్తి మరీ బలీయంగా ఉంటే... వార్డు మెంబర్ల కోసం కూడా ఈ మంత్రాన్ని తీయక తప్పదన్న మాట కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఓ ఎంపీ స్థాయి నేత ఏకంగా సీఎం స్థాయి నేతకే చెమటలు పట్టిస్తుంటే... ఈ తరహా చిన్నాచితకా నేతలను ఆకట్టుకునేందుకు - ఏకంగా పార్టీలోకి లాగేసేందుకు ఈ మంత్రదండాన్ని తీయక తప్పదన్న మాట కూడా వినిపిస్తోంది. ఇప్పుడు టీఆర్ ఎస్ ఈ దండాన్ని తీస్తోంది నిజామాబాద్ కార్పొరేషన్ లో కాగా... అందుకు కారణంగా నిలుస్తున్నది అక్కడి లోకల్ ఎంపీ - బీజేపీ యువ నేత ధర్మపురి అరవిందేనట.

వరుస పెట్టి అన్ని ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తూ వస్తున్న టీఆర్ ఎస్ కు మొన్నటి మునిసిపల్ ఎన్నికల్లోనే అదే తరహా విజయమే దక్కింది. అయినా కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం టీఆర్ ఎస్ కు గట్టి పోటీ ఎదురైంది. వంద సీట్లలో 98 సీట్లు దక్కినప్పుడు దక్కే ఆనందం కంటే... రెండు సీట్లలో ఓటమి వల్ల వచ్చే దు:ఖమే పెద్దదిగా కనిపిస్తుందట. ఇప్పుడు గులాబీ దళపతి - తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిస్థితి కూడా ఆ మాదిరిగానే ఉందని చెప్పక తప్పదు. మొన్నటి మునిసిపల్ ఎన్నికల్లో దాదాపుగా అన్ని స్థానాల్లో విజయం దక్కినా... కొన్నిచోట్ల అధికార పీఠాలను దక్కించుకునేందుకు టీఆర్ ఎస్ నానా తంటాలు పడాల్సి వచ్చింది. మిత్రపక్షాలుగా ఉన్న మజ్లిస్ తో పాటు కాంగ్రెస్ పార్టీకి దక్కిన కార్పొరేటర్ సీట్లను కలుపుకుంటే గానీ... టీఆర్ ఎస్ కు పీఠం దక్కలేదు. అలాంటి స్థానాల్లో నిజామాబాద్ మేయర్ పీఠం ఒకటి. ఈ పీఠాన్ని దక్కించుకునే విషయంలో కేసీఆర్ నానా పాట్లూ పడాల్సి వచ్చింది.

సార్వత్రిక ఎన్నికలతో పాటు మునిసిపల్ పోరులోనూ ధర్మపురి అరవింద్ అదికార పార్టీకి చుక్కలు చూపారు. సార్వత్రికంలో ఏకంగా కేసీఆర్ కూతురును ఓడించిన అరవింద్... పుర పోరులో టీఆర్ ఎస్ తో పాటు మజ్లిస్ ను కూడా ధీటుగా ఎదుర్కొని 60 కార్పొరేటర్ స్థానాలున్న కార్పొరేషన్ లో ఏకంగా 28 సీట్లను గెలుచుకున్నారు. సింగిల్ హ్యాండ్ తో ధర్మపురి కొట్టిన దెబ్బ కేసీఆర్ అండ్ కోకు బాగానే తగిలినట్టుంది. అందుకే... ఎంత త్వరగా వీలయితే... అంత త్వరగా ధర్మపురి స్పీడుకు బ్రేకులేయాలని గులాబీ నేతలు మంత్రాంగం రచించారట. ఈ మంత్రాంగంలో భాగంగా... ఏకంగా ఓ పది కార్పొరేటర్లను తమ వైపునకు లాగేసేందుకు పక్కా స్కెచ్ వేసినట్టుగా సమాచారం. అంతేకాకుండా ఈ తతంగం కార్పొరేషన్ తొలి సర్వసభ్య సమావేశం జరిగేలోగానే ముగించాలని కూడా ప్లాన్ వేశారట. అయితే గెలిచిన 28 మంది బీజేపీ కార్పొరేటర్లలో మెజారిటీ మంది ధర్మపురికి అత్యంత సన్నిహితులే కాకుండా... ఆయనకు నమ్మిన బంటులట. దీంతో టీఆర్ ఎస్ నేతలు ఆపరేషన్ ఆకర్ష్ కోసం బాగా శ్రమిస్తున్నారట. మరి వీరి ప్లాన్ వర్కవుట్ అవుతుందో? లేదంటే ధర్మపురి ముందు చిత్తవుతుందో చూడాలి.
Tags:    

Similar News