దమ్ముంటే కేటీఆర్ ను సిరిసిల్లలో ఓడించండి..గవర్నర్ కు సవాల్

Update: 2022-05-16 15:30 GMT
తెలంగాణ గవర్నర్, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు పొడచూపాయి. కేసీఆర్ సర్కార్ తనను పట్టించుకోకపోవడంపై ఢిల్లీ వెళ్లి మరీ కేంద్రం పెద్దలకు ఫిర్యాదు చేసింది గవర్నర్. అనంతరం కేసీఆర్ పై విరుచుకుపడింది. దీనికి టీఆర్ఎస్ మంత్రులు కౌంటర్లతో విరుచుకుపడ్డారు.

ఇటీవల ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో విమర్శల వాన కురిపించడంతో గవర్నర్ తమిళిసైను టార్గెట్ చేసి కౌంటర్లతో విరుచుకుపడుతున్నారు గులాబీ శ్రేణులు.  గవర్నర్ తగ్గకపోవడంతో ఇరువైపుల నుంచి మాటల యుద్ధం ఆగడం లేదు. ఢిల్లీ వేదికగా తమిళిసై చేసిన విమర్శలకు ఇప్పుడు తెలంగాణ మంత్రులు తీవ్రస్థాయిలో కౌంటర్లు ఇచ్చారు. ఇప్పుడు టీఆర్ఎస్ నెటిజన్లు ఆమెపై సోషల్ మీడియాలో సవాళ్లు చేస్తున్నారు.

సోషల్ మీడియా సాక్షిగా తెలంగాణ గవర్నర్ తమిళిసైతో సవాల్ చేస్తున్నారు గులాబీశ్రేణులు. దమ్ముంటే సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ పై పోటీచేయాలని సవాల్ చేస్తున్నారు. ఈ మేరకు ట్వీట్టర్ లో ట్రోల్స్ మొదలయ్యాయి.

తమిళనాడు బీజేపీ అధ్యక్షులు తమిళిసై గారు, మీ నాన్న ఎంపీ, కేటీఆర్ నాన్న కూడా ఎంపీనే.. మీరు పోటీచేసిన స్తానాల్లో 1వ మరియు 2వ సారి మీ ఓటింగ్ శాతం మారలేదు. కానీ సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదంతో కేటీఆర్ 2009లో గెలుపొందారు. ఆయనపై సిరిసిల్ల నుంచి పోటీచేయడానికి మీకు స్వాగతం అంటూ ట్వీట్లు చేస్తూ హోరెత్తిస్తున్నారు.

తెలంగాణ రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా దిగాలని తమిళిసైని టీఆర్ఎస్ శ్రేణులు సవాల్ చేస్తున్నారు. తమిళిసైని బీజేపీకి చెందిన నేతగానే చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విమర్శలకు తమిళిసై ఎలాంటి కౌంటర్లు ఇస్తారన్నది వేచిచూడాలి. ఇప్పటికైతే టగ్ ఆఫ్ వార్ గా నడుస్తున్న ఈ ఫైట్ లో గవర్నర్ దీనిపై ఏం స్పందిస్తారన్నది వేచిచూడాలి.
Tags:    

Similar News