లేఔట్‌ డెవలపర్లకు తెలంగాణకు ప్రభుత్వం షాక్‌!

Update: 2022-05-21 06:30 GMT
లేఔట్‌ డెవలపర్లకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద షాకిచ్చింది. లేఔట్లలో అనుమతి లేని ప్లాట్లకు సంబంధించి క్రయ, విక్రయాలు జరపడానికి ఇక ఆస్కారం ఉండదు. హైదరాబాద్‌ మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ), డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ (డీటీసీపీ) అనుమతులు లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను అంగీకరించబోమని తెలంగాణ రిజిస్ట్రేషన్‌ శాఖ తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం.. లేఔట్లలో అనుమతి లేని ప్లాట్లను అమ్మేందుకు, కొనేందుకు అవకాశం ఉండదు. గతంలోనే తెలంగాణ సర్కార్‌ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై రియల్టర్లు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో రియల్టర్లకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. అనుమతులు లేకపోయినా లేఔట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయాలని హైకోర్టు నాడు పేర్కొంది. అయితే సదరు ప్లాట్లకు అనుమతులు లేవని, దీనిపై లావాదేవీలు జరపడం అమ్మేవారు, కొనేవారికి రిస్క్‌ అంటూ రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్‌పై పేర్కొనాలని తీర్పు ఇచ్చింది.

తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. అత్యున్నత న్యాయస్థానంలో తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. రియల్టర్లకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది.

ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు లేని ప్లాట్ల అమ్మకాలకు, కొనుగోలుకు అంగీకారం తెలపవద్దని తెలంగాణ సర్కార్‌కు సూచించింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు తాజాగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మే 20 నుంచి హైదరాబాద్‌ మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీ, డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ అనుమతులు లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, గతంలోనే అనుమతుల్లేని లేఔట్ల ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇందుకోసం స్థలాల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌)ను ప్రవేశపెట్టింది. అయితే దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేక వచ్చింది. అదేసమయంలో హైదరాబాద్‌ నగర పాలక సంస్థ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రతికూల ఫలితాలు రావడంతో కేసీఆర్‌ సర్కార్‌ ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉపసంహరించుకుంది.

లేఔట్లలో అప్పటికే అమ్ముడైన ప్లాట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేయాలని చెప్పి ప్రజలకు కొంత ఊరటనిచ్చింది. అప్పటివరకు అమ్మని ప్లాట్లకు మాత్రం తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సిందేనని తేల్చిచెప్పింది. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా అక్రమ లేఔట్లలో డెవలపర్ల వద్ద ఉన్న ప్లాట్లకు మాత్రమే వర్తిస్తుందని తెలంగాణ సర్కార్‌ స్పష్టతనిచ్చింది. ఇప్పటికే క్రయవిక్రయ లావాదేవీలు జరిపిన ప్లాట్లకు తాజా ఉత్తర్వులు వర్తించవని వివరణ ఇచ్చింది.
Tags:    

Similar News